AP News: సీఈసీ పర్యవేక్షణలోనే కౌంటింగ్ చేపట్టాలి: దేవినేని ఉమ
ABN, Publish Date - May 23 , 2024 | 06:47 PM
రాష్ట్రంలో అధికారుల తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై అధికారులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. వైసీపీకి వంతపాడటమే జవహార్ రెడ్డి పనిగా మారిందని విమర్శించారు. ఇదే విషయమైన గురువారం నాడు మీడియాతో మాట్లాడారు దేవినేని ఉమ. 13వ తేదీన మధ్యాహ్నం స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ..
అమరావతి, మే 23: రాష్ట్రంలో అధికారుల తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై అధికారులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. వైసీపీకి వంతపాడటమే జవహార్ రెడ్డి పనిగా మారిందని విమర్శించారు. ఇదే విషయమైన గురువారం నాడు మీడియాతో మాట్లాడారు దేవినేని ఉమ. 13వ తేదీన మధ్యాహ్నం స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టాడని ఆరోపించారు. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ జరిగిందని.. ఆ కారణంగానే పిన్నెల్లి వ్యవహారం బయటపడిందన్నారు. అయితే, 15వ తేదీన వీఆర్వో పెట్టిన కేసులో పిన్నెల్లి పేరు లేదన్నారు. చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో పోలింగ్ అధికారులను నియమించారని.. 20వ తేదీన సిట్ పర్యవేక్షణలో జరిగిన విచారణ కోర్టులో వేసిన మెమోలో ఈ వాస్తవాలు అన్నీ బయటకొచ్చాయన్నారు. 10సెక్షన్లతో కేసు నమోదు చేసామని సీఈఓ చెబితే.. ఇంకా సిగ్గు లేకుండా మంత్రి అంబటి, కాసు మహేష్ రెడ్డి వీటిని తప్పుబడుతున్నారని దేవినేని ఫైర్ అయ్యారు.
సీఈఓ చేసిన ప్రకటనను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే.. కౌంటింగ్ ప్రక్రియను సక్రమంగా జరగనిస్తారా? అని దేవినేని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లను వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ‘పోలింగ్ నాడు సహకరించలేదు.. కౌంటింగ్ నాడు మీ సంగతి చూస్తామంటూ వాళ్ల కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూతులు తిడుతూ బెదిరిస్తున్నారు’ అని అధికారులు వాపోతున్నారన్నారు. ఇంత జరుగుతుంటే.. చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే చీఫ్ సెక్రటరీ ఈ పదవిలో ఉండటానికి అర్హత లేదు. నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి’ అని దేవినేని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగితేనే రిటర్నింగ్ అధికారులకు రక్షణ ఉంటుందని దేవినేని అన్నారు. సినిమా ఫక్కిలో ఎమ్మెల్యే అనుచరులు బ్లూమీడియా ఛానల్స్‌లో ప్రచారం చేశారని.. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ధనుంజయ్ రెడ్డి తతంగం అంతా చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. రఘురామ్ రెడ్డి, సజ్జల, భార్గవ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఆంజనేయులు పర్యవేక్షణలో కొంతమంది పోలీసులను బెదిరించి ఇటువంటి ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నారని విమర్శించారు. పిన్నెల్లి దేశం వదిలిపెట్టి వెళ్లాడా? రాష్ట్రం వదిలి వెళ్లాడా? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని దేవినేని ప్రశ్నించారు. ప్రజావేదిక విధ్వంసంతో వైఎస్ జగన్ చేసిన అరాచక పాలన ఎమ్మెల్యే ఈవీఎం విధ్వసంతో పరిసమాప్తం అయ్యిందని వ్యాఖ్యానించారు. సాక్షి యాజమాన్యం, పత్రిక, ఛానల్‌పై కేసులు బుక్ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమీషన్, సీఈఓ చెప్పిన తరువాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న వారిని అరెస్ట్ చేసి, కేసులు బుక్ చేయాలన్నారు.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 23 , 2024 | 06:47 PM