Devineni Uma: వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు

ABN, Publish Date - Sep 23 , 2024 | 10:34 PM

వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Devineni Uma: వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు

ఎన్టీఆర్ జిల్లా, (గొల్లపూడి): వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. లక్షలాది సేవా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముకుని వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఒక్క వైవీ సుబ్బారెడ్డే 3 లక్షల 75 వేల టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపించారు.


ఎంత ధైర్యం ఉంటే గోవింద నామాలు స్మరించాల్సిన తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు జగన్నామ స్మరణ చేస్తారని మండిపడ్డారు. జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను సమర్థిస్తూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి తిరుమల పవిత్రను దెబ్బతీసే కార్యక్రమాలు చేసిన సుబ్బారెడ్డి జగన్‌కు సూపర్ స్వామిలా కనపడుతున్నారా? అని ప్రశ్నించారు. ఇడుపులపాయలో వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు చేసే ప్రార్థనలు ప్రజలంతా చూశారని విమర్శలు చేశారు.


తిరుమలలో ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో బయటకు రావాలని.. నెయ్యి మీదే ఐదేళ్లలో రూ. 450 కోట్ల దోపిడీ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలపైకఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లండన్ మందులు సరిగా వాడకపోవడం వల్ల జగన్ రెడ్డి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఆవులను మేపక పోవడం వల్ల పరీక్షల్లో తేడాలు వచ్చాయంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు.


దేశ ప్రధానికి రాసిన లేఖలో టెండర్లు ప్రక్రియ సక్రమంగా జరగ లేదంటూ, తిరుమలలో ల్యాబ్ లేదంటూ పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైనుల్లో లక్షల కోట్లు దోచేసి తాడేపల్లి కొంపకు తరలించినా జగన్ రెడ్డి ధన దాహం తీరలేదని చెప్పారు. తిరుమలపై జగన్ రెడ్డి కన్ను పడటంతో కరుణాకర్‌రెడ్డిని, సీబీఐ ఈడీ కేసుల్లో ముద్దాయి అయిన వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్లుగా చేశారనన్నారు. నిందితులను బోర్డ్ డైరెక్టర్లుగా చేశారని ఆరోపించారు. ఐదేళ్లపాటు చేయాల్సిన పాపాలు, దుర్మార్గాలు చేసి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడటం తిరుమల పట్ల వారి వైఖరిని తెలియజేస్తుందని అన్నారు. వారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి సమగ్ర విచారణతో కఠినంగా శిక్షించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు కాపాడాలని దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు.

Updated Date - Sep 23 , 2024 | 10:34 PM