గుడివాడ సభకు తరలిరండి
ABN , Publish Date - Jan 18 , 2024 | 01:40 AM
ఈ నెల 18వ తేదీన గుడివాడలో నిర్వహించనున్న ‘రా.. కదిలారా’ చంద్రబాబు భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు.
గుడివాడ జనవరి 17 : ఈ నెల 18వ తేదీన గుడివాడలో నిర్వహించనున్న ‘రా.. కదిలారా’ చంద్రబాబు భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు. బుధవారం మల్లాయిపాలెం గ్రామపరిధిలో అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, షర్మిలకు పీసీసీ పదవితో జగన్‌రెడ్డికి వెన్నులో వణుకు ప్రారంభమైందన్నారు. చెల్లెలి చేతిలో వైసీపీ బలి అవ్వడం ఖాయమని, 2029కి పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. జగన్ వదిలిన బాణం రివర్స్‌లో జగన్‌కే తగులుతోందని, కాళ్లా వేళ్లా పడినా జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి ఆరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, చంద్రబాబు రాకకు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో టీడీపీ జెండాను తిరిగి రెపరెపలాడిస్తామన్నారు. దీనికి ఈ సభ వేదికగా నిలుస్తుందని, స్పష్టమైన సంకేతాలను నానికి ప్రజలు చూపిస్తారన్నారు. 18వ తేదీన జిల్లాలోని అన్ని రహదారులు గుడివాడ వైపే వస్తాయన్నారు. అంచనాలకు మించి ప్రజలు హాజరవుతారని, గుడివాడ పసుపుమయవుతుందన్నారు. టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
మీడియా సమావేశంలో టీడీపీ నేతలు
దళిత మహిళా నేతకు అవమానం సిగ్గుచేటు
కొల్లు రవీంద్ర ఆవేదన
మచిలీపట్నం టౌన్ : దళిత మహిళలను అవమానంగా చూడటం వైసీపీ నాయకులకు కొత్తకాదని, అదే క్రమంలో దళిత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై బహిరంగ సభలో స్ర్కీన్‌పై వైసీపీ నాయకులు, అధికారులు అసభ్యంగా, అవమానకరంగా ప్రదర్శించడం అన్యాయమని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్ర కార్యాలయం వద్ద బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడారు. అసభ్య ప్రదర్శనపై కోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు. గురువారం గుడివాడలో జరగనున్న చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ముందుగా నిమ్మకూరు వస్తారని, అనంతరం గుడివాడలో బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. సభలో తెలుగుదేశం పార్టీ అధినేత కృష్ణాజిల్లా అభివృద్ధికి హామీలు ఇస్తారన్నారు. బందరు పోర్టు నిర్మించేసత్తా చంద్రబాబుకే ఉందన్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, తాను మచిలీపట్నం పరిశీలకురాలిగా ఇక్కడకు వచ్చానన్నారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుడివాడ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీనియర్ నేత గొర్రెపాటి గోపీచంద్, మోటమర్రి బాబా ప్రసాద్, లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.