Waqf Amendment Act: వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్‌పై కూటమి ఎంపీలు ఏమన్నారంటే..
ABN, Publish Date - Nov 03 , 2024 | 09:20 PM
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇమాములు, ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు, హజ్ యాత్రకు రూ.లక్ష ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మతసామరస్యాన్ని కాపాడే వ్యక్తని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఏపీ సీఎం అన్ని మతాలను ఒకే విధంగా గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నారని ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన వక్ఫ్ పరిరక్షణ సభలో ఎంపీలు కేశినేని శివనాథ్, లావు కృష్ణదేవరాయలు, ప్రజాసంఘాల నాయకులు, ముస్లిం మతపెద్దలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
చంద్రబాబుతో చర్చించాం..
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. " వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఏపీ మంత్రి ఫరూఖ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో పలువురు పార్లమెంట్ సభ్యులను ముస్లిం మతపెద్దలు కలిశారు. దీనికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబుతోనూ చర్చించడం జరిగింది. టీడీపీ తరఫున ఈ అంశాన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీ(JPC)కి పంపించాం. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఇతర పార్టీల్లాగా డొంకతిరుగుడు విధానాలు మేము అవలంభించడం లేదు. నేడు జేపీసీ ఏర్పాటు కావడంతోపాటు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టుపై జాతీయస్థాయిలో చర్చ ప్రారంభమైంది.
రూ.లక్ష ఇస్తాం..
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారు. ఇమాములు, ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు, హజ్ యాత్రకు రూ.లక్ష ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మతం వారి హక్కులనైనా కాలరాసే విధానాలను చంద్రబాబు ఎప్పటికీ అంగీకరించరు. మా ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇప్పటికే జేపీసీ దృష్టికి మీ అభ్యంతరాలన్నీ తీసుకువెళ్లారు. వీటిపై చర్చించి త్వరలోనే మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఒక మతం విషయంలో మరొక మతం వారు జోక్యం చేసుకోవటం సబబు కాదని చంద్రబాబు ఇటీవల అందరికీ చెప్పారు. ముస్లిం సోదరులంతా సమన్వయం పాటించండి, తప్పకుండా మీకు మంచే జరుగుతుంది.
38.16 లక్షల ఎకరాలు..
మరో ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. " వక్ఫ్ పరిరక్షణ కోసం ముస్లిం సోదరులంతా సంఘటితమై సభ ఏర్పాటు చేశారు. అనేక మంది మతపెద్దలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు వక్ఫ్ పరిరక్షణకు సంబంధించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. వక్ఫ్ ఆస్తులు 9లక్షల ఎకరాల దాకా ఉంటాయని అనేక మంది పెద్దలు చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా 38.16 లక్షల ఎకరాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముస్లిం సోదరులంతా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నా. 2024 యాక్టుకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు నా దృష్టి తీసుకువచ్చారు. ఆ ఐదు అంశాలను జేపీసీలో పెట్టి చర్చించేలా కృషి చేస్తా.
ఏపీలోనూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 నుంచి 70 వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై మనమంతా ఆలోచన చేయాలి. ఆ తర్వాత పేదలకు వీటి ద్వారా ఎటువంటి మేలు చేయాలనే కార్యాచరణ రూపొందించాలి. దేశంలో ముస్లింలు మాత్రమే ఎక్కువగా వెనకబడి ఉన్నారని సచారి కమిటీ నివేదిక చెబుతోంది. వక్ఫ్ ఆస్తుల విషయంలో దేశం, రాష్ట్రం మొత్తం మీద ఒకే విధానం అమలు చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. వక్ఫ్ భూముల ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే వాటిని రక్షించగలం. ఆ భూముల వివరాలు ఆన్ లైన్‌లో ఉంచితే పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఏపీలో ఈ విధానాన్ని అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Politics: చంద్రబాబు.. ప్రజా ముఖ్యమంత్రి
AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం
Julakanti Brahmananda Reddy: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..
For More AndhraPradesh News And Telugu News..
Updated Date - Nov 03 , 2024 | 09:21 PM