Rains: ఎన్టీఆర్ జిల్లాను ముంచెత్తిన వరదలు..
ABN, Publish Date - Sep 01 , 2024 | 08:12 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.
కొండపల్లి మండలం..
వర్షాలకు బుడమేరు పొంగిపొర్లుతోంది. దీంతో కొండపల్లి మండలం శాంతినగర్ ఇందిరమ్మ కాలనీని వరదనీరు ముంచెత్తింది. నిన్న(శనివారం) రాత్రి సమయంలో సుమారు 200కుటుంబాలు నీటిలో చిక్కుకున్నాయి. శాంతినగర్‌కు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాత్రివేళ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అయినా అధికారులు మాత్రం జేసీబీల సహాయంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుడమేరు వరదనీరు శాంతినగర్ కాలనీలోకి రావడంతో పలు ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం నిండిపోయాయి. దీన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహాయక చర్యల కోసం వెళ్లిన ఓ మత్స్యకారుడి బోటు సహితం గల్లంతైంది. బోటులోని మత్స్యకారులు సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. కొండపల్లి, రాయనపాడు మధ్య రైల్వే ట్రాక్ మునిగిపోవడంతో సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను కొండపల్లి వద్ద రైల్వే అధికారులు నిలిపివేశారు.
జగ్గయ్యపేట మండలం..
కృష్ణానదికి భారీగా వరదనీరు చేరడంతో జగ్గయ్యపేట మండలంలో పలు గ్రామాలకు వరదనీరు పోటెత్తింది. మండలవ్యాప్తంగా పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణానది పరీవాహక గ్రామమైన రావిరాలను వరదనీరు చుట్టుముట్టింది. గ్రామంలోకి నీరు చేరడంతో ప్రజలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. వరద చేరుతున్న సమయంలో అప్రమత్తమైన గ్రామస్థులు.. పశు సంపద, విలువైన వస్తువులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. ప్రస్తుతానికి ఏ శాఖకు చెందిన అధికారులూ గ్రామానికి చేరుకోలేదని రావిరాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట సత్యనారాయణపురంలో ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. పలు ఇళ్లు నీట మునిగి స్థానికులు నానావస్థలు పడుతున్నారు.
నందిగామ మండలం..
నందిగామ మండలంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తు్న్నాయి. నల్లవాగుకు భారీగా వరదనీరు చేరడంతో నందిగామ- చందర్లపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అడవిరావులపాడు, చందాపురం గ్రామల వద్ద వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చందాపురం వద్ద వరదనీటి కోతకు గురై రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలోని వాగులు వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
మైలవరం మండలం..
మైలవరం మండలం వెల్వడం సమీపం బుడమేరు వరదలో ముగ్గురు గ్రామస్థులు చిక్కుకుపోయారు. ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన ముగ్గురు టేకు చెట్లను పట్టుకుని నీటిలోనే ఉండిపోయారు. రాత్రి వేళ కావడంతో వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించేందుకు తీవ్ర ఆటంకం ఎదురైంది. మైలవరం తారకరామానగర్‌లో పలు ఇళ్లు ముంపునకు గురికాగా.. బాధిత కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే మండలవ్యాప్తంగా పలు గ్రామాల చెరువుకట్టలు తెగి అలుగు పారుతున్నాయి. చంద్రాల గ్రామ చెరువుకు గండిపడింది. గ్రామంలోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో గ్రామస్థులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
జి.కొండూరు మండలం..
జి.కొండూరు మండలం వెలగలేరు హైస్కూల్ కాలనీలో 200కుటుంబాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. గత రాత్రి భారీగా వర్షం కురవడంతో బుడమేరు, కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ వరదనీరు వెలగలేరును ముంచెత్తింది. రాత్రి సమయం కావడంతో కాలనీ వాసులంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు వచ్చి రక్షించాలని, పునరావాస కేంద్రాలకు తరలించాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు కుంటముక్కల, చిన్న నందిగామ చెరువులకు గండి పడింది. చెరువు కింద ఉన్న పంట పొలాలపై వరదనీరు పడి.. వరి, పత్తి పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.సృజన వర్షాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెనెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే ముంపు గ్రామాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సృజన ఆదేశించారు.
Updated Date - Sep 01 , 2024 | 08:26 AM