Raghu Veera Reddy: షర్మిల రాకతో జగన్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది
ABN , Publish Date - Jan 21 , 2024 | 02:37 PM
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ( Sharmila ) రాకతో జగన్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ( Raghu Veera Reddy ) అన్నారు.

విజయవాడ: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ( Sharmila ) రాకతో జగన్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ( Raghu Veera Reddy ) అన్నారు. ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల వస్తుంటే దారి పొడవునా ఆటంకాలు కలిగించారని మండిపడ్డారు. ఏపీలో తప్పకుండా కాంగ్రెస్‌కు పూర్వవైభవం రావడం ఖాయమన్నారు. షర్మిల జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ కలుస్తారని తెలిపారు. కాంగ్రెస్ తరపున వైఎస్సార్ అభిమానులకు, పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తారని.. ఆమె వెంట కలిసి నడుస్తారన్నారు. ఏపీసీసీ కోసం గిడుగు రుద్రరాజు చేసిన త్యాగం మరువలేనిదని చెప్పారు.
షర్మిల, కాంగ్రెస్ కోసం రుద్రరాజు తన పదవిని వదిలేశారన్నారు. బీజేపీతో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని.. వాళ్ల ముగ్గురూ మోదీ, బీజేపీకి కట్టు బానిసలు అని ఎద్దేవా చేశారు. వాళ్లకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని చెప్పారు. ఏపీకి ఈ ముగ్గురూ ద్రోహులుగా నిలబడ్డారని.. అలాంటి వారిని తరిమి కొట్టాలని హెచ్చరించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎర్రకోటపై ప్రధాని హోదాలో జాతీయ పతాకం ఎగుర వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే చేస్తారని..అదే కాంగ్రెస్‌కు, రాహుల్ గాంధీకి గుండె చప్పుడు అని రఘువీరారెడ్డి తెలిపారు.