AP News: వైసీపీ హయాంలో సర్పంచ్‌లను వేధించారు: వైవీబీ రాజేంద్రప్రసాద్
ABN, Publish Date - Jul 27 , 2024 | 04:17 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధి హామీ నిధులు రూ.250కోట్లు, నీరు- చెట్టు కింద రూ.45కోట్లు విడుదల చేసినందుకు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధి హామీ నిధులు రూ.250కోట్లు, నీరు- చెట్టు కింద రూ.45కోట్లు విడుదల చేసినందుకు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు తీరని ద్రోహం జరిగిందని, పంచాయతీ రాజ్ వ్యవస్థను కాపుడుకోవడానికి వైసీపీ హయాంలో పోరాటాలు చేసినట్లు రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల నిధులు దుర్వినియోగం చేశారని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించకుండా వారిని వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తాము ఎన్నో ఉద్యమాలు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. తమ ఉద్యమాలు ఫలించి ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారం చేపట్టాకే నిధులు విడుదల చేసి తమను ఆదుకున్నట్లు రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
16డిమాండ్లతో ముఖ్యమంత్రికి మెమోరాండం..
సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం పెంచేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీలకు సంబంధించి16డిమాండ్లతో కూడిన మెమోరాండంను ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే కావడానికి గత ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధులను పక్కదారి పట్టించిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఛాంబర్ సభ్యులు కృషి చేశారంటూ ఎమ్మెల్యే జి.శంకర్ భావోద్వేగాని లోనయ్యారు. కార్యక్రమానికి హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్‌తోపాటు అనంతపురం ఎమ్మెల్యే, రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన ప్రసాద్‌ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఆకతాయిలపై పవన్‌కు ఫిర్యాదు చేసిన మహిళ..
మరోవైపు డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు వినతులు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. జనసేన కేంద్ర కార్యాలయానికి పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న ఫిర్యాదు దారులు తమ సమస్యలు వినాలంటూ డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన పలు అర్జీలను ఆయన ఓపికగా పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు పంపి వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్‌లో యువకుల ఆగడాలు మితిమీరి పోయాయంటూ డిప్యూటీ సీఎం పవన్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆకతాయిలు బైక్స్‌పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులు, యువతులు, మహిళలను వేధిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై ఆగ్రహించిన పవన్ మహిళ ఇచ్చిన ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని డిప్యూటీ సీఎం హెచ్చరికలు జారీ చేశారు.
Updated Date - Jul 27 , 2024 | 04:17 PM