AP Govt: తుంగభద్ర డ్యామ్ కొత్త గేటు ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు
ABN, Publish Date - Aug 11 , 2024 | 10:08 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశాలతో తుంగభద్ర డ్యామ్ కొత్త గేటు ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్‌కు సంబంధించి 19వ గేటు శనివారం రాత్రి కొట్టుకుపోయిందని చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశాలతో తుంగభద్ర డ్యామ్ కొత్త గేటు ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్‌కు సంబంధించి 19వ గేటు శనివారం రాత్రి కొట్టుకుపోయిందని వెల్లడించారు.
కొత్త గేట్ల ఏర్పాటుకు ఆదేశాలు..
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో అక్కడ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సంబంధిత జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఉన్నత అధికారుల నుంచి తెలుసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గేటు కొట్టుకుపోయిన స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు సమీక్షించారని తెలిపారు. తనతో, ప్రిన్సిపల్ సెక్రటరీతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ప్రజలను అప్రమత్తం చేసేలా..
తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్ పంపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృథా పోకుండా చర్యలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించామని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గేట్ కొట్టుకుపోవడం వల్ల రైతులకు నష్టం కలగకుండా వరద నీటి నిర్వహణ ఒక ప్రణాళిక ప్రకారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. డ్యాం నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిది అయినా, నిర్వహణ ఖర్చు కింద, ఏపీ వాటా 35 శాతం ఉండటంతో, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తుంగభద్ర డ్యాం నిర్వహణకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి నిమ్మల రామానాయడు ఆరోపణలు చేశారు.
చంద్రబాబు ఆరా..
తుంగభద్ర డ్యామ్ గేటు ఊడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డ్యామ్ వద్దకెళ్లి పరిస్థితిని గమనించాలని కోరారు. అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యామ్ గేట్ల నిపుణులు కన్నం నాయుడిని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. డ్యామ్ 19వ గేటు నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే ..?
మరోవైపు... అధికారుల నిర్లక్ష్యంతో డ్యామ్ గేటు ఊడింది. కర్ణాటకలో హోస్పేట్ వద్ద ఈ ఘటన జరిగింది. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు (Tungabhadra Dam 19Th Gate) నిన్న రాత్రి (శనివారం) ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. దీంతో అధికారులు ఆందోళన చెందారు. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. గేటు తెగడంతో నీటి ప్రవావం పోటెత్తింది. తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలారు. ప్రాజెక్ట్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు బయటకు వస్తోంది.
60 టీఎంసీల నీరు..
ప్రాజెక్ట్ నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్దరణ పనులు చేపడతామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆదివారం ఉదయం డ్యామ్‌ను కర్ణాటక మంత్రి శివరాజ్ సందర్శించారు. డ్యాట్ గేటు కొట్టుకోని పోవడంతో కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాలు ప్రజలపై ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో కోరింది. సహాయం కోసం 1070 112, 1800 425 0101 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది.
స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరమని అన్నారు.
19వ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో సమస్య తలెత్తిందని అన్నారు. 17వ గేటు నుంచి 32వ గేట్ల నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. నిపుణుల బృందం జలాశయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. కేంద్ర జల సంఘం కూడా నిపుణులను పంపిందని వివరించారు. జలాశయం నుంచి నీరు పెద్ద ఎత్తున బయటకు పోతోందని అన్నారు. జలాశయం దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ డ్యామ్ కర్నాటక - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మూడు రాష్ట్రాలకు వరప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచినట్లు తెలిపారు. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుందని వివరించారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని చెప్పారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమేనని.. రైతులు సహకరించాలని డిప్యూటీ సీఎం శివకుమార్ కోరారు.
తుంగభద్ర జలాశయంపై సీఎం సిద్ధరామయ్య ఆరా
కర్ణాటక: తుంగభద్ర రిజర్వాయర్ గేటు తెగిపోయిన ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. తుంగభద్ర జలాశయం వద్ద తాజా పరిణామాలపై సీఎం ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. ఎల్లుండి (మంగళవారం) జలాశయం వద్దకు సీఎం సిద్దరామయ్య వెళ్లనున్నారు.
Updated Date - Aug 11 , 2024 | 10:27 PM