Parcel Body Case: ‘పార్శిల్‌లో మృతదేహం’ ఆచూకీ లభ్యం
ABN, Publish Date - Dec 24 , 2024 | 03:39 AM
పార్శిల్‌లో మృతదేహం డోర్ డెలివరీ కేసు చిక్కుముడులు వీడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండికి చెందిన సాగి తులసికి ఈ నెల 19న చెక్కపెట్టెలో మృతదేహం వచ్చింది.
కాళ్ల గ్రామవాసి పర్లయ్యదిగా గుర్తింపు
పని ఇప్పిస్తానని తీసుకువెళ్లి హత్య?
పలు జిల్లాల్లో తీవ్ర గాలింపు అనంతరం అదుపులోకి నిందితుడు శ్రీధర్ వర్మ
మచిలీపట్నంలో పట్టుకున్న పోలీసులు
ఉండి/భీమవరం క్రైం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పార్శిల్‌లో మృతదేహం డోర్ డెలివరీ కేసు చిక్కుముడులు వీడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండికి చెందిన సాగి తులసికి ఈ నెల 19న చెక్కపెట్టెలో మృతదేహం వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు తులసి చెల్లెలు రేవతి, ఆమె భర్త తిరుమాని శ్రీధర్‌వర్మ(సిద్ధార్ధ వర్మ/సుధీర్ వర్మ)ను నిందితుడిగా తేల్చారు. పార్శిల్‌లో వచ్చిన మృత దేహాన్ని కాళ్ల గ్రామ శివారు గాంధీనగర్‌కు చెందిన బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. పర్లయ్య వారం రోజులుగా కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. అంతకు రెండు రోజుల ముందే ఆయనను శ్రీధర్‌వర్మ తన ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి, తీసుకురావడాన్ని వారు చూశారు. పర్లయ్యను శ్రీధర్ వర్మ తన చెరువు పనికి, ఇంటి వద్ద తాపీ పనికి మూడు రోజులపాటు తీసుకువెళ్లాడు. అనంతరం ఆయన కనిపించలేదు. పర్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసైన పర్లయ్య భార్యా పిల్లలను పట్టించుకోకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారులు పర్లయ్యను పట్టించుకోరని స్థానికులు తెలిపారు. దీంతో పర్లయ్య నిత్యం మద్యం తాగి చిన్న చిన్న పనులకు వెళ్లి ఎక్కడో ఓ చోట తలదాచుకుంటాడు. ఆ విధంగానే ఎక్కడికో వెళ్లి ఉంటాడని కుమారులు పట్టించుకోలేదు. కానీ, గ్రామాన్ని విడిచి వెళ్లని పర్లయ్య.. వారం రోజులుగా కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. శ్రీధర్‌వర్మ... మృతదేహాన్ని పార్శిల్ పంపాడని పత్రికల్లో రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి మూడు గంటల వరకు ఆ గ్రామంలోని ఒక వ్యక్తి ఇంటి వద్ద సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. శ్రీధర్‌వర్మ పర్లయ్యను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లడం, తీసుకురావడం గమనించి ఆ మృతదేహం పర్లయ్యదిగా నిర్ధారించారు.
మహిళ ఆచూకీ కోసం
ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్‌వర్మ.. మృతదేహం పార్శిల్‌ను ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన మహిళ ఆచూకీ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం గాలిస్తోం ది. ఎరుపు రంగు కారులో శ్రీధర్‌వర్మ కలిదిండి నుం చి ఏలూరు వైపు వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో గమనించారు. దీంతో మృతదేహం పార్శిల్‌ను ఆటో డ్రైవర్ కు ఇచ్చిన మహిళను శ్రీధర్ వర్మ నాలుగో వివాహం చేసుకున్నాడా? లేక కిరాయికి మాట్లాడుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో శ్రీధర్‌వర్మ
‘పార్శిల్‌లో మృతదేహం డోర్ డెలివరీ’ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తిరుమాని శ్రీధర్‌వర్మను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సాయం త్రం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీధర్‌వర్మను కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం-బంటుమిల్లి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వర్మను భీమవరానికి తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది.
Updated Date - Dec 24 , 2024 | 03:39 AM