AIIMS Convocation : నేడు ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం
ABN , Publish Date - Dec 17 , 2024 | 03:56 AM
మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం మధ్యాహ్నం జరగనుంది.
ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
అమరావతి, మంగళగిరి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం మధ్యాహ్నం జరగనుంది. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్యఅతిథిగా హాజరై వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. 2018-19లో తొలి బ్యాచ్‌గా 49 మంది విద్యార్థులు చేరారు. వీరంతా వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకున్నారు. వీరిలో 47 మందికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. మరో నలుగురికి పీడీసీసీ సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించిన పట్టాలు అందజేస్తారు. ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మరో నలుగురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందిస్తారు. ఎయిమ్స్ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగే ఈ స్నాతకోత్సవంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, రాష్ట్ర వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొంటారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధబానందకర్ తెలిపారు. రాష్ట్రపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎయిమ్స్ డైరెక్టర్ మధబానందకర్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవతేజ రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్నాతకోత్సవం జరిగే ప్రధాన ఆడిటోరియంలో రాష్ట్రపతితో విద్యార్థుల ఫొటో సెషన్, వాహనాల పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సరఫరా అంశాలపై పలు సూచనలు చేశారు.