APSRTC: చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు!
ABN, Publish Date - Jun 24 , 2024 | 04:00 AM
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు. ఓ ప్రైవేటు మాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.
లీజు పేరుతో 17 ప్రాంతాల్లో కట్టబెట్టిన అధికారులు
రాష్ట్రంలో 70 ప్రాంతాల్లో టెండర్లు
భాస్కరరెడ్డికి కీలక ప్రాంతాలు
వైసీపీ హయాంలో తతంగం
పేరుకే టెండర్లు.. అధిక ధరకు కోట్ చేసిన వారికి బెదిరింపులు
ఒంగోలు బస్సు డిపో ఆవరణలో పనులు ప్రారంభించిన వైసీపీ నేత
అడ్డుకున్న జనసేన నేత రియాజ్
లీజులు రద్దు చేయిస్తాం: టీడీపీ
ఒంగోలు(కార్పొరేషన్), జూన్ 23: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు. ఓ ప్రైవేటు మాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవహారాన్ని నడిపారు. టెండర్ల ప్రక్రియను అపహాస్యం చేశారు. తన కన్నా ఎక్కువ ధర కోట్ చేసిన వారిని బెదిరించడంతోపాటు, వారిపై ఒత్తిళ్లు తెచ్చి తప్పుకొనేలా చేశారు. ఆర్టీసీ అధికారులను సైతం తన దారిలోకి తెచ్చుకున్నారు. చివరికి తన కుమారుడు మోహిత్‌రెడ్డి పేరుతో రాష్ట్రంలోని 17 ఆర్టీసీ బస్టాండ్‌లలో ఉన్న ఖాళీ స్థలాలను చేజిక్కించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బస్టాండ్ ఆవరణలో ఉన్న స్థలంలో పనులు చేస్తుండగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఆదివారం అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భూభాగోతం వెలుగు చూసింది.
మాల్‌కు లీజు..!!
చెవిరెడ్డి ఓ ప్రైవేటు మాల్‌కు 70 ప్రాంతాల్లో అవసరమైన స్థలాలను లీజు పద్ధతిన ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీనికిగాను ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారు. పార్టీ పెద్దలతో సంస్థ అధికారులపై ఒత్తిడి తెప్పించి అభివృద్ధి, ఆదాయం పేరుతో రాష్ట్రంలోని ఆర్టీసీ స్థలాల లీజుకు టెండర్లు పిలిపించినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన సంస్థలను కూడా నయానో, భయానో పక్కకు తప్పించి మొత్తం 17 ప్రాంతాల్లో ఆర్టీసీ స్థలాలను ఆయన దక్కించుకున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు ఒక నెల ముందు ఆర్టీసీ ఆస్తుల లీజుకు సంబంధించి ఆ సంస్థ ప్రకటన చేసింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్థలానికి మంచి గిరాకీ ఉంది. రూ.20 కోట్ల విలువ చేసే సుమారు 40 సెంట్ల స్థలాన్ని పదిహేనేళ్లపాటు నెలకు రూ.1.80 లక్షలు చెల్లించేలా అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్రమంలో చెవిరెడ్డి తన కుమారుడు మోహిత్‌రెడ్డి పేరుతో టెండర్ దాఖలు చేశారు. ఆయనకన్నా ఇద్దరు ఎక్కువ ధర కోట్ చేశారు. వారిలో ఒక మహిళ, ప్రైవేటు డాక్టర్ ఉన్నారు. చెవిరెడ్డి వారిద్దరినీ బెదిరించి తప్పుకొనేలా చేసినట్లు ఆరోపణలున్నాయి. అదేసమయంలో నెల్లూరులో ఆర్టీసీ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు సమాచారం. దీంతో మూడో వ్యక్తిగా ఉన్న మోహిత్‌రెడ్డికి నెలకు రూ.2.40 లక్షలు అద్దె చెల్లించేలా టెండర్ దక్కింది.
లీజు టెండర్లు రద్దు చేయాలి: దామచర్ల
ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ భూములను కబ్జాచేసిన వైసీపీ నేతలు ఆర్టీసీ ఆస్తులపైనా కన్నేయడం దుర్మార్గమని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 ఆర్టీసీ డిపోల పరిధిలో లీజు పద్ధతిన కేటాయించిన ఆస్తులను కాపాడుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు పిలిచిన టెండర్లు రద్దు చేయిస్తామన్నారు.
Updated Date - Jun 24 , 2024 | 08:05 AM