Andhra Pradesh :విజయంతో విరమణ
ABN, Publish Date - Jun 01 , 2024 | 03:33 AM
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అనుకున్నది సాధించారు. యూనిఫాంలో రిటైరవ్వాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరింది. హైకోర్టు చెప్పిందనో, ఉన్నతాధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందనో తెలియదు గానీ.. ఆయన పదవీవిరమణ చేయాల్సిన శుక్రవారం నాడే జగన్ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.
హైకోర్టు వ్యాఖ్యలతో ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఉదయం సస్పెన్షన్ ఎత్తివేస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు
ప్రింటింగ్-స్టేషనరీ కమిషనర్‌గా నియామకం
మధ్యాహ్నం బాధ్యతల స్వీకారం.. సాయంత్రం పదవీ విరమణ
ఉద్యోగుల ఘన వీడ్కోలు.. ఆర్టీసీ ఎండీ, ఐఏఎస్ శ్రీధర్ అభినందనలు
జగన్ కక్షసాధింపులకు పాల్పడినా పోలీసు యూనిఫాంలోనే
ఏబీవీ రిటైర్మెంట్
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అనుకున్నది సాధించారు. యూనిఫాంలో రిటైరవ్వాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరింది. హైకోర్టు చెప్పిందనో, ఉన్నతాధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందనో తెలియదు గానీ.. ఆయన పదవీవిరమణ చేయాల్సిన శుక్రవారం నాడే జగన్ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.
(అమరావతి/విజయవాడ-ఆంధ్రజ్యోతి)
చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం తొలి నుంచీ కక్షగట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆ పదవి నుంచి తప్పించేలా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చింది. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి పక్కకు తప్పించింది. అధికారంలోకి రాగానే లేని కేసు పెట్టింది.
ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసింది. చివరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడానికీ విశ్వప్రయత్నాలు చేసింది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యంతో ఆ పనిచేయలేకపోయారు. అయితే అధికారం అడ్డుపెట్టుకుని ఐదేళ్లుగా ఏబీవీని తీవ్ర ఇబ్బందుల పాల్జేశారు. అయినా ఆయన ఆత్మస్థైర్యం తగ్గలేదు. న్యాయ పోరాటం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టులను ఆశ్రయించారు..
ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. ఆయన పోరాటానికి ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. చివరకు విజయం ఆయన్నే వరించింది. తాను అనుకున్నట్లుగా పోలీస్ యూనిఫాంలోనే రిటైర్ అయ్యారు. ఏబీవీని రెండోసారి సస్పెండ్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు గురువారం నిరాకరించిన సంగతి తెలిసిందే.
శుక్రవారమే పదవీ విరమణ చేయాల్సిన ఆయన.. సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్నారని.. పదవీ విరమణకు ముందు ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆయనకు పూడ్చుకోలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రిటైర్ కాబోతున్న ఆయన్ను తిరిగి సర్వీసులోకి తీసుకుంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదన సరైనది కాదని పేర్కొంది.
ఆయనకు ఇప్పటికే ముందస్తు బెయిల్ లభించిందని, దాని రద్దుకు ప్రాసిక్యూషన్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తుచేసింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఏబీవీ స్వయంగా సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసి అందజేశారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. అయితే ఆయన మౌనంగా ఉండిపోయారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ఎంకే మీనాకు కూడా ఏబీవీ కోర్టు ఉత్తర్వుల ప్రతి పంపించారు
ఈ నేపథ్యంలో ఆయన రీ జాయినింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్యాట్ ఉత్తర్వులిచ్చినా, హైకోర్టు చెప్పినా ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు ధోరణి కొనసాగించింది. దేశ చరిత్రలో తొలిసారి సస్పెన్షన్‌లోనే రిటైరైన ఐపీఎస్ అధికారిగా చరిత్రలో నిలిచిపోయేవారు. ఆయన్ను సర్వీసులోకి తీసుకోకూడదని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారని, కచ్చితంగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వరని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ కూడా నడిచింది. తెల్లవారేసరికి సీన్ మారిపోయింది. ఏమైందో ఏమో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేయడమే గాక రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్ పర్జేజింగ్ కమిషనర్‌గా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. లండన్‌లో ఉన్న సీఎంతో సీఎస్ నేరుగా మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. తెగేదాకా లాగవద్దని.. ఈ వ్యవహారంపై అఖిల భారత అధికారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సీఎంకు వివరించినట్లు సమాచారం.
జగన్ ఆమోదించిన తర్వాతే ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఎక్కడైతే విధులు నిర్వహించి రెండోసారి సస్పెండయ్యారో.. అదే విభాగంలో నియమించారు. ఉదయం సీఎస్ ఉత్తర్వులు అందుకున్న వెంటనే ఏబీవీ విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఆ శాఖ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాకు రెండేళ్ల తర్వాత పోస్టింగ్ లభించింది. ఇదే రోజు నా పదవీ విరమణ కూడా. కారణాలు ఏమైనప్పటికీ అంతా మంచే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయను.
ప్రభుత్వం పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడంతో విధుల్లో చేరాను. ఇన్నాళ్లూ నాకు తోడుగా ఉన్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. కుటుంబ సభ్యులకు, మిత్రులకు, దేశవిదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులకు కృతజ్ఞుడిని’ అని వ్యాఖ్యానించారు. ఆత్మ సంతృప్తితోనే పదవీవిరమణ చేస్తున్నానని తెలిపారు.
Updated Date - Jun 01 , 2024 | 03:33 AM