బస్సు లోపల్నుంచే షో!
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:13 AM
ఉమ్మడి గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ఆయన పార్టీ శ్రేణులకు సైతం నిరాశనే మిగిల్చింది. జగన్ వస్తున్నారంటూ వైసీపీ నాయకులు గురువారం మధ్యాహ్నం నుంచే పలు కూడళ్లకు మహిళలను ఆటోల్లో తరలించారు. అయితే జగన్
ఓటు అడగలేదు..అభ్యర్థుల ఊసూ లేదు
ఉమ్మడి గోదావరి జిల్లాలో చప్పగా జగన్ యాత్ర
ఆసాంతం అభివాదాలతోనే సరి
నుదుటికి ఉన్న బ్యాండేజ్ చూపిస్తూ సానుభూతి కోసం ప్రయత్నం
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ఆయన పార్టీ శ్రేణులకు సైతం నిరాశనే మిగిల్చింది. జగన్ వస్తున్నారంటూ వైసీపీ నాయకులు గురువారం మధ్యాహ్నం నుంచే పలు కూడళ్లకు మహిళలను ఆటోల్లో తరలించారు. అయితే జగన్ ఎక్కడా బస్సు దిగలేదు. బస్ లోపల నుంచి షో చేశారంతే! నోరు తెరిచి ఓటు అడగలేదు. చివరకు అభ్యర్థుల ఊసూ ఎత్తకపోవడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఒక పక్క ఎండ మండిపోతున్నా రూ.200 ఇచ్చి ఆటోల్లో తరలించిన జనం...జగన్‌ను చూసేందుకు వేచిఉన్నారు. అయినా ఆయన బయటకు మాత్రం రాలేదు. ఏసీ బస్ లోపల నుంచే అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. కనీసం గ్లాస్ కూడా తీయకపోవడంపై వైసీపీ కార్యకర్తలు నిరాశ చెందారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం తేతలి నుంచి జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. తణుకు బైపా్‌సలో ఒక్కచోట మాత్రమే బస్సు నుంచి బయటకు వచ్చారు. మిగిలిన సెంటర్లలో బస్సు లోపలి నుంచే అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆయన యాత్ర కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. ముఖ్య కూడళ్ల వద్ద మాట్లాతారని ఎదురుచూసినా జగన్... అభివాదంతోనే సరిపెట్టారు. కాగా పోలీసుల ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. చంటి పిల్లలతో మహిళలు, వృద్ధులు ఎండకు అల్లాడిపోయారు. రావులపాలెం బస్టాండు ఇన్, అవుట్ గేట్లలో వైసీపీ నాయకులు వాహనాలను పార్కింగ్ చేయడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అనంతరం ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లా పెరవలి మీదుగా సిద్ధాంతం చేరింది. అక్కడ సీఎం బయటకు వచ్చి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం తాడితోట జంక్షనులో ఓ చిన్నారికి వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. ముగ్గురు పేపరు మిల్లు కార్మికులతో మాట్లాడారు. పొట్టిలంక నుంచి రాజానగరం వరకు మైకు అందుకుని మాట్లాడింది లేదు.నుదుటికి ఉన్న బ్యాండేజ్‌ను చూపిస్తూ సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు.
బస్సు యాత్రలో ‘అతి’
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పోలీసులు భద్రత పేరిట జగన్ బస్సు యాత్రలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ నాయకుడు జెట్టి గురునాథరావును బస్సులోకి వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. మహిళలను కొందరు మహిళా పోలీసులు బయటకు నెట్టేశారు.