YSRCP: శింగనమల అభ్యర్థిని మార్చాల్సిందే.. లేదంటే టీడీపీని గెలిపిస్తాం
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:32 AM
అనంతపురం జిల్లా శింగనమల (ఎస్సీ) నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి తారస్థాయికి చేరుకుంది. సిటింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
జగన్‌కు వైసీపీ అసమ్మతి నేతల అల్టిమేటం
ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా భేటీ
శింగనమల, మార్చి 26: అనంతపురం(Anantapuram) జిల్లా శింగనమల (ఎస్సీ) నియోజకవర్గం వైసీపీలో(YCP) అసమ్మతి తారస్థాయికి చేరుకుంది. సిటింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన చెప్పిన అభ్యర్థి వీరాంజనేయులును మార్చి తీరాలని.. లేదంటే టీడీపీ అభ్యర్థిని బండారు శ్రావణిశ్రీని గెలిపిస్తామని సీఎం జగన్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో సాంబశివారెడ్డి నాయకత్వాన్ని వైసీపీలోని మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ కారణంగానే ఆయన భార్య పద్మావతికి వైసీపీ టికెట్ దక్కలేదు.
అయితే సాంబశివారెడ్డి సొంత మనిషి అయిన వీరాంజనేయులుకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేసినా నాయకత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అనంతపురంలోని బల్లా కన్వెన్షన్‌లో మంగళవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని అసమ్మతి నాయకులు నిర్ణయించుకున్నారు. అయితే సాంబశివారెడ్డి అడ్డుకున్నారు. అనుమతి లేదని పోలీసులు బల్లా కన్వెన్షన్‌ను ఉదయమే తమ అధీనంలోకి తీసుకున్నారు.
Also Read: ఇంటికి కిలో బంగారమిచ్చినా జగన్‌కు ఓటమి తప్పదు..
దీనిని ముందే ఊహించిన అసమ్మతి నాయకులు.. శివపురం పెద్దమ్మ గుడి వద్ద సమావేశం నిర్వహించారు. అభ్యర్థిని ప్రకటించే ముందు పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్లు సత్యనారాయణరెడ్డి, నారాయణరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, రాష్ట్ర కార్యదర్శి చాములూరి రాజుగోపాల్ తదితరులు ధ్వజమెత్తారు. ‘వెంటనే అభ్యర్థిని మార్చి వేరే అభ్యర్థిని ప్రకటించండి. లేకపోతే పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదు. పెద్దమ్మ సాక్షిగా చెబుతున్నాం..’ అని హెచ్చరించారు.