Share News

కూటమికి జై

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:12 AM

ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని పలు సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ ద్వారా వెల్లడించాయి. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల కాగా.. మెజార్టీ సంస్థలు ఎన్డీఏ కూటమిదే అధికారమని స్పష్టం చేశాయి.

కూటమికి జై

- శ్రీకాకుళం పార్లమెంట్‌తోపాటు మెజార్టీ అసెంబ్లీలు ఎన్డీఏకే..

- వెల్లడించిన పలు సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌

- ఆనందంలో తెలుగుతమ్ముళ్లు..

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని పలు సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ ద్వారా వెల్లడించాయి. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల కాగా.. మెజార్టీ సంస్థలు ఎన్డీఏ కూటమిదే అధికారమని స్పష్టం చేశాయి. ఇక ‘రైజ్‌’ సంస్థ సీఈవో ప్రవీణ్‌ రాష్ట్రంలో ఎగ్జిట్‌పోల్స్‌ నివేదికను శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో వెల్లడించారు.

- జిల్లాలో శ్రీకాకుళం లోక్‌సభతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మరోసారి గెలుస్తారని సర్వే సంస్థలు చెప్పాయి. అలాగే ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరు లేదా ఏడు స్థానాల్లో ఎన్డీఏ కూటమికే పగ్గాలు అప్పజెప్పారని తెలిపాయి. వైసీపీలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటివారు సైతం ఓటమి చెందుతున్నారని వెల్లడించారు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలో టైట్‌ఫైట్‌ ఉంటుందని సర్వేలో వెల్లడైంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో తెలుగు తమ్ముళ్లలో సందడి నెలకొంది. బీజేపీ శ్రేణులు, జనసైనికుల్లో కూడా ఉత్సాహం ఉరకలేసింది. ఐదేళ్లు వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజల్లో కూడా ఆనందం కనిపించింది. ఈసారి అధికార మార్పిడి ఖాయమని.. ఎన్డీఏ కూటమి పాలన వస్తుందనే చర్చలు మొదలయ్యాయి. ఏదిఏమైనా తుది ఫలితాల కోసం మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

ప్రభుత్వ వైఫల్యాలు బలంగా ప్రజల్లోకి..

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను టీడీపీ జిల్లా నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. సంక్షేమం పేరిట బటన్‌ నొక్కి డబ్బులు ఖాతాలో వేయడం, అంతకు రెండు, మూడింతలు ఏదో రూపంలో లాక్కోవడం.. అధ్వానంగా మారిన రహదారులు.. అభివృద్ధి గురించి పూర్తిగా పట్టించుకోకపోవడం.. అప్పులు కుప్పలుతెప్పలుగా తీసుకుని రావడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందే ప్రజల్లోకి వెళ్లిన అధికారపార్టీ నాయకులు ఈవిషయం స్పష్టంగా వెల్లడైంది. అయినా మేకపోతు గాంభీర్యంలో తాము గెలుస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. శనివారం ఎగ్జిట్‌పోల్‌ సర్వేలను చూసి వారంతా కంగుతిన్నారు. గెలుపుపై వారిలో సందేహాలు నెలకొన్నాయి. పార్టీ అధికారంలోకి రావడం సంగతి అటుంచితే.. కనీసం తామైనా గెలుస్తామా? అని ఆరా తీస్తుండడం కనిపించింది.

Updated Date - Jun 02 , 2024 | 12:12 AM