నా హక్కులకు భంగం!
ABN, Publish Date - Nov 19 , 2024 | 04:39 AM
శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. వెలగలేరు, వేమవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు.
అక్రమ మైనింగ్‌లో నా ప్రమేయం ఉందని మండలిలో మంత్రి కొల్లు చెప్పారు
వివరణ కోసం అసెంబ్లీలో వసంత పట్టు
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. వెలగలేరు, వేమవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు. మంత్రి వ్యాఖ్యలతో నా హక్కులకు భంగం వాటిల్లింది. మంత్రి పొరపాటున అలా చెప్పారా? లేక అధికారులు ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చారా? దీనిపై మంత్రితో సభలోనే వివరణ ఇప్పించాలి’ అని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. ఈ ఆసక్తికర పరిణామం సోమవారం జీరో అవర్‌లో చోటుచేసుకుంది. అప్పుడు సభలోనే ఉన్న మంత్రి కొల్లు స్పందిస్తూ.. ‘రాజమండ్రి నుంచి వచ్చే పోలవరం కాలువ పరిధిలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ కాలువలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, దోపిడీ వ్యవహారంపై దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించాం. ఆ వివరాలనే మండలిలో చెప్పాను. ఎక్కడా వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు’ అని చెప్పారు.
కృష్ణప్రసాద్ సంతృప్తి చెందలేదు. వెలగలేరు, కొత్తూరుతాడేపల్లి తన నియోజకవర్గ పరిధిలోకే వస్తాయని, తన పరువుకు భంగం వాటిల్లినందున మంత్రి సమగ్రమైన వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. కొల్లు మళ్లీ మాట్లాడుతూ.. ‘ఆ గ్రావెల్ కేసులో మొత్తం 170మంది ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఇందులో మీ ప్రస్తావన లేదు. అన్యథా భావించవద్దు’ అని స్పష్టం చేయడంతో కృష్ణప్రసాద్ శాంతించారు.
కాగా, రాష్ట్ర పరిధిలో ఉన్న 8 రైల్వే డివిజన్లు, 4 రైల్వే జోన్లలో రైల్వే ప్రయాణికుల సలహా సంఘాలకు ఒక్కో ప్రతినిధి చొప్పున ఎన్నికవడానికి ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రంలోగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో సూచించారు. 20న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణల అనంతరం పోటీ ఏర్పడితే 22న ఎన్నిక నిర్వహిస్తామని.. పోటీ లేకపోతే నామినేట్ చేస్తామని వివరించారు. ఈ మేరకు ప్రభుత్వ తీర్మానాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.
సమావేశాలను మరో వారం పొడిగించాలి : కొణతాల
బడ్జెట్ సమావేశాలను మరో వారం రోజులు పొడిగించి, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ఒక పూట మాత్రమే సభ నిర్వహిస్తే.. రెండోపూట శాసనసభ్యులు ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులు, మంత్రులను కలిసి చర్చించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించేవారని, ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని కోరారు. అందరి అభిప్రాయం అదే అయితే చప్పట్ల ద్వారా ఆమోదం తెలపాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. అందరూ ఆమోదం తెలుపడంతో.. ఈ విషయాన్ని స్పీకర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 04:39 AM