ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam: పాపం పసివాళ్లు!

ABN, Publish Date - Aug 20 , 2024 | 04:14 AM

అభంశుభం ఎరుగని చిన్నారులను కలుషితాహారం కాటేసింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ‘పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన మందిరం’ పేరిట నడుపుతున్న అనాథాశ్రమంలో ఘోరం జరిగింది.

  • అనాథాశ్రమంలో ఉసురు తీసిన ఆహారం

  • ముగ్గురు మృతి.. ఏడుగురి పరిస్థితి విషమం

  • ఓ ఫంక్షన్‌లో మిగిలిన బిర్యానీ పెట్టిన నిర్వాహకుడు

  • కొన్ని గంటలకే పిల్లలకు వాంతులు, విరేచనాలు

  • ఆస్పత్రికి తరలించకుండా ఇళ్లకు పంపిన పాస్టర్‌

  • 80 మందికిపైగా అస్వస్థత.. 42 మంది ఆస్పత్రిపాలు

  • అనకాపల్లి జిల్లా కోటవురట్లలో విషాదం

అందరూ పేదింటి గిరిజన బిడ్డలు! ఎవరికీ పట్టుమని పదేళ్లు కూడా నిండలేదు. ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని, చదువు చెప్పిస్తామని పాస్టర్‌ చెప్పిన మాట విని... తల్లిదండ్రులు వారిని ‘అనాథాశ్రమానికి’ పంపించారు. ఓ ఫంక్షన్‌కు వెళ్లి అక్కడ మిగిలిపోయిన బిర్యానీ తెచ్చి పెట్టిన నిర్వాహకుడు... వారి ఉసురు తీశాడు. ఆ ఆశ్రమానికి అనుమతుల్లేవు. వసతుల్లేవు. పదేళ్లుగా అక్రమంగా నడుస్తున్నా పట్టించుకున్న వాళ్లూ లేరు!

విశాఖపట్నం/కోటవురట్ల/నర్సీపట్నం, ఆగస్టు 19: అభంశుభం ఎరుగని చిన్నారులను కలుషితాహారం కాటేసింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ‘పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన మందిరం’ పేరిట నడుపుతున్న అనాథాశ్రమంలో ఘోరం జరిగింది. ఆశ్రమ నిర్వాహకుడు ఓ ఫంక్షన్‌లో మిగిలిన ఆహారం తీసుకొచ్చి రాత్రి పిల్లలకు పెట్టారు. ఆహారం కలుషితం కావడంతో ముగ్గురు పిల్లలు మృత్యువాతపడ్డారు. మొత్తం 80 మంది వరకు అస్వస్థతకు గురవగా, వీరిలో 42 మందిని తల్లిదండ్రులే వివిధ ఆస్పత్రులకు తరలించారు.

వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నటు సమాచారం. పూర్తి వివరాలివీ.. కైలాసపట్నంలో ముకుడిపల్లి అర్జునరావు అనే వ్యక్తి 2010లో క్రిస్టియన్‌ ప్రార్థనా మందిరం ప్రారంభించారు. అర్జునరావు 2013లో మరణించడంతో ఆయన కుమారుడు పాస్టర్‌ కిరణ్‌కుమార్‌ దాని నిర్వహణ చూస్తున్నారు.

ఒకవైపు ప్రార్థనా మందిరాన్ని నిర్వహిస్తూనే.. మరోవైపు ట్రస్ట్‌ను నెలకొల్పి దాని ఆధ్వర్యంలో అనాథాశ్రమం నడుపుతున్నారు. పేరుకు అనాథాశ్రమమే అయినా.. ఇక్కడ ఉన్న పిల్లందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. భోజనం పెట్టడంతోపాటు మంచి చదువు చెప్పిస్తానని పాస్టర్‌ కిరణ్‌కుమార్‌ చెప్పడంతో తల్లిదండ్రులు పిల్లలను పంపించారు. ప్రస్తుతం ఆ ఆశ్రమంలో 91 మంది ఉన్నారు.


ఈ నెల 17న కోటవురట్ల మండలం పందూరులో ఒక ఫంక్షన్‌కు పాస్టర్‌ కిరణ్‌కుమార్‌ హాజరయ్యారు. ఆ ఫంక్షన్‌లో మిగిలిపోయిన బిర్యానీ, కూరలు తెచ్చి రాత్రి ఆశ్రమంలో విద్యార్థులకు పెట్టారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి విద్యార్థులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.

అయితే బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా వారి తల్లిదండ్రులకు కిరణ్‌ సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లారు. అలా వెళ్లిన వారిలో చింతపల్లి మండలం నిమ్మలపాలెంకు చెందిన తాంబేల్లి జాషువా (7), జామ్మి చెట్టుకు చెందిన కొర్రా సాధ(7), కొయ్యూరు మండలం రేవళ్లపాలెంకు చెందిన గెమ్మెల భవానీ అలియాస్‌ నిత్య (8) మృతిచెందారు. మరో 42 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


అనుమతుల్లేకుండానే...

కలుషితాహారం పిల్లలను కాటేసిన విషయం తెలియగానే... అధికారులు, పోలీసులు హుటాహుటిన అనాథాశ్రమానికి వచ్చారు. ఆ ట్రస్ట్‌కు ఎటువంటి అనుమతులూ లేవని గుర్తించారు. సాయంత్రం 4గంటలకు అనాథాశ్రమానికి జేసీ జాహ్నవి, నర్సీపట్నం ఆర్డీవో జయరామ్‌ వచ్చారు. విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేవని గుర్తించారు. పదేళ్ల నుంచి ట్రస్ట్‌ నడుపుతున్నా విద్యాశాఖాధికారులు గుర్తించకపోవడంపై జాయింట్‌ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగిన అధికారులకు కిరణ్‌కుమార్‌ సమాధానం ఇవ్వలేదు.


సకాలంలో ఆస్పత్రికి తరలించి ఉంటే..

అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రులో చేరిన విద్యార్థుల పరిస్థితి కొంత నిలకడగానే ఉన్నా.. విశాఖ కేజీహెచ్‌లో చేరిన 14 మంది చిన్నారుల్లో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సకాలంలో వైద్యం అందకపోవడమే ఇందుకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. ‘ఆహారం తీసుకున్న తరువాత చిన్నారులకు అనేకసార్లు వాంతులు, విరేచనాలయ్యాయి.

శరీరం నుంచి ఖనిజ లవణాలైనా క్లోరైడ్‌, పొటాషియం, సోడియం, బైకార్బొనేట్‌ బయటకు వెళ్లిపోయాయి. దీంతో పూర్తిగా డీహైడ్రేట్‌ అయి షాక్‌లోకి వెళ్లారు. కిడ్నీ పనితీరు మందగించడంతోపాటు సీరం క్రియాట్నిన్‌ లెవెల్స్‌ నాలుగు నుంచి ఐదు వరకు పెరిగాయి. గుండె వేగం కూడా తగ్గింది’ అని వైద్యులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన వారిలో జస్సిక (9) పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు.


విచారణకు కలెక్టర్‌ ఆదేశాలు

ఆశ్రమంలో చిన్నారులు మృతిచెందిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చెప్పారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను సోమవారం ఆమె పరామర్శించారు. హాస్టల్‌ నుంచి ఇళ్లకు వెళ్లిన పిల్లలను ఆస్పత్రికి తరలించాలని చింతపల్లి తహసీల్దార్‌ను ఆదేశించారు.

పాస్టర్‌ కిరణ్‌ అరెస్టు: ఎస్పీ

ఎస్పీ దీపిక మాట్లాడుతూ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ఆహార పదార్థాల శాంపిల్స్‌ సేకరిస్తామని తెలిపారు. ముగ్గురు పిల్లల మృతికి కారణమైన పాస్టర్‌ కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేశామన్నారు. ఆయనపై సెక్షన్‌ 304 పార్టు2 కింద కేసు నమోదు చేశామని చెప్పారు.


ఈ తరహా హాస్టళ్ల మూసివేత: హోంమంత్రి

విశాఖపట్నం: అనారోగ్యానికి గురైన చిన్నారులకు కేజీహెచ్‌లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 14 మంది చిన్నారులను ఆమె సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహారాన్ని ఎవరు పంపించారు? సమోసాలు ఎవరు తెచ్చారనే దానిపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు. ఈ తరహా హాస్టళ్లను మూసివేస్తామని చెప్పారు.


రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

  • చిన్నారుల మృతి కలచివేసింది: చంద్రబాబు

  • పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటన

విశాఖపట్నంలో విషతుల్యమైన ఆహారం తిని ముగ్గురు పేద పిల్లలు చనిపోవడం తీవ్ర వేదన కలిగించిందని చంద్రబాబు అన్నారు. మరణించిన చిన్నారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లా సోమశిలలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఉండగా చంద్రబాబుకు ఈ విషయం తెలిసి దిగ్ర్భాంతి చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన పిల్లలకు నాణ్యమైన వైద్యం అందించి, వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

Updated Date - Aug 20 , 2024 | 08:00 AM

Advertising
Advertising
<