AP Politics: నేను కూడా పొత్తుకు రెడీ.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 16 , 2024 | 09:43 PM
అధికార వైసీపీ (YSRCP)కి చెందిన వలంటీర్లు తన పార్టీకి మద్దతిస్తే వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం తన పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులకు హామీ పత్రాలు ఇస్తానని ప్రకటించారు.
విశాఖపట్నం: అధికార వైసీపీ (YSRCP)కి చెందిన వలంటీర్లు తన పార్టీకి మద్దతిస్తే వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం తన పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులకు హామీ పత్రాలు ఇస్తానని ప్రకటించారు. ఏపీలో పొత్తుల రాజకీయాలు ట్రెండ్ నడుస్తోందని, తాను కూడా పార్టీ నాయకులతో మాట్లాడి ప్రజలకు అవసరమైన పార్టీలతో పొత్తులు పెట్టుకుంటానని చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే 100 రోజుల్లో అద్భుతమైన కంపెనీలను ఏపీకు తీసుకొస్తానని అన్నారు. హైదరాబాద్‌లో కూడా భారీ కంపెనీలను తీసుకు రావడంలో తన వంతు శ్రమ కూడా ఉందని తెలిపారు.
పాల్ ద్వారానే ప్రపంచ భారీ కంపెనీల సీఈఓలు హైదరాబాద్‌కు వచ్చారని అనాడు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావును గెలిపించడానికి రూ.1200 కోట్లను కేంద్రం బడ్జెట్‌లో కేటాయించిందని ఆరోపించారు. టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబును ఓడించడానికి రూ.100 కోట్లకు పైగా వైసీపీ నేత ఎమ్.వీవీ సత్యనారాయణ ఖర్చు చేయడానికి రెడీ అయ్యారని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ భార్యను గెలిపించడానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయడానికి సిద్ధం అయ్యారని ధ్వజమెత్తారు. ఆ నేతలందరూ దొంగలు కాబట్టి దోచుకున్న డబ్బులనూ పంచడానికి చూస్తున్నారని అన్నారు. ఏ పార్టీ నేతలు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలనీ ఓటు మాత్రం తన పార్టీకి ఓటు వేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వంతో దేశం నాశనం అయిపోతుందని మండిపడ్డారు. ఏపీలో ఉన్న పార్టీలన్నీ మోదీకి బానిసలుగా మారిపోయాయని ఆరోపించారు. ఎంపీగా తాను గెలిస్తే రాబోయే ఎన్నికల్లో బీసీ నేతలను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేస్తానని కేఏ పాల్ తెలిపారు.
Updated Date - Feb 16 , 2024 | 09:43 PM