Nara Lokesh: ఆ పెన్నులో ఇంకంతా అవినీతి సంతకాలకే.. మంత్రి బొత్సపై నారా లోకేష్ ఫైర్
ABN, Publish Date - Feb 15 , 2024 | 05:21 PM
మంత్రి బొత్స సత్యనారాయణ పెన్నుల్లోని ఇంకంతా అవినీతి సంతకాలకే సరిపోతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. గురువారం నాడు చీపురపల్లిలో శంఖారావం సభ నిర్వహించారు.
విజయనగరం: మంత్రి బొత్స సత్యనారాయణ పెన్నుల్లోని ఇంకంతా అవినీతి సంతకాలకే సరిపోతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. గురువారం నాడు చీపురపల్లిలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఓ 420... ఆయన సలహాదారులు 840 అని ఎద్దేవా చేశారు. అధికారం ఉందని ఏక పక్షంగా వ్యవహారించిన వైసీపీ నేతలు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లోకి చేర్చుతానని వార్నింగ్ ఇచ్చారు. జగనే అసమర్థుడంటే ఆయన మంత్రివర్గమంతా చెత్తగాళ్లేనని ఆరోపించారు. పేదవాళ్లంతా పైసా కూడా చెల్లించనవసరం లేకుండా టీడీపీ అధికారంలోకి రాగానే అందరికీ పక్కా గృహాలు కట్టిస్తామని తెలిపారు.
జగన్ పేటీఎం కూలీలకు ఐదు రూపాయలిచ్చి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పెళ్లిపై, పుట్టుకపై నీతి లేకుండా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ సూపర్ 6 పథకాల ద్వారా అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి బొత్స కుటుంబమంతా విజయనగరం జిల్లాకు క్యాన్సర్ గడ్డలా తయారైందని మండిపడ్డారు. ఉత్తరాంధ్రా గురించి ఏనాడైనా పార్లమెంట్‌లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గొంతు విప్పారా అని ప్రశ్నించారు. బొత్స అనే క్యాన్సర్ గడ్డకు ఓటనే రేడియేషన్ అవసరమని అన్నారు. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు టీడీపీలోనే కొనసాగుతారని నారా లోకేష్ పేర్కొన్నారు.
Updated Date - Feb 15 , 2024 | 05:29 PM