AP Politics: జగన్ ఇంకోసారి అలా చేయొద్దు.. టీడీపీ ఎంపీ స్పెషల్ రిక్వెస్ట్..
ABN, Publish Date - Jul 25 , 2024 | 11:32 AM
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉండగా.. జగన్ సీఎం హోదాలో లెక్కలేనన్ని ఢిల్లీ పర్యటనలు చేసి.. ఐదు కోట్ల ఆంధ్రులకు ఏమి తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ ఏం సాధించారని అడిగారు. వైసీపీ పరిపాలన బాగోలేదని ఇటీవల ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని.. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో.. ఎన్డీయే కూటమిపై విశ్వాసంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ఐదు కోట్ల ఆంధ్రులు ఓట్లు వేశారన్నారు. ప్రజలు ఎంతో బాధ్యత, గౌరవంతో తమను చట్టసభలకు పంపిస్తే.. జగన్ తన ఢిల్లీ పర్యటనతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పరువు, ప్రతిష్టలను ఢిల్లీ నడిరోడ్డులో తాకట్టుపెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని.. ఆయన తీరు చూస్తుంటే తీవ్రమైన బాధకలుగుతుందన్నారు.
Chandrababu : కిక్కు లెక్క తేలుస్తాం
విఫల నేత..
విపక్ష నేతగా జగన్ తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. రాజకీయాలు వేరు.. రాష్ట్ర ప్రయోజనాలు వేరని.. ఈ విషయాన్ని మరిచిపోయి జగన్ ప్రవర్తిస్తున్నారన్నారు. చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించిందని, రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సాయం అందించడంపై బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ నేతగా సానుకూల ప్రకటన చేస్తారని తనతో పాటు ఐదు కోట్ల ఆంధ్రులు భావించారని.. కానీ జగన్ బడ్జెట్‌పై అభినందనలు తెలపలేదన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవాలనే ఆలోచన టీడీపీకి లేదన్నారు. ఇప్పటికైనా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఆలోచన చేసుకోవాలన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అప్పలనాయుడు విమర్శించారు. ఇకనుంచైనా ఢిల్లీ వచ్చినప్పుడు బాధ్యతతో వ్యవహరించాలని జగన్‌కు ఎంపీ కలిశెట్టి సూచించారు.
ఆత్మపరిశీలన చేసుకోండి..
గత ఐదేళ్ల వైసీపీ పాలనపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. 2019లో వైసీపీకి భారీ మెజార్టీ ఇస్తే మీరు చేసిన పరిపాలన ఏమిటో గుర్తుచేసుకోవాలని సూచించారు. తన పరిపాలనపై ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటే ఢిల్లీ పర్యటనను జగన్మోహన్ రెడ్డి విరమించుకునేవార్నారు. జగన్ తీరును చూసి వైసీపీ నాయకులే ముక్కున వేలు వేసుకుంటున్నారని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. జగన్ వ్యవహరాన్ని సొంత పార్టీ నాయకులే తప్పబడుతున్నారని, ఇప్పటికైనా జగన్ తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా ప్రయాణం జరుగుతున్న వేళ రాష్ట్ర పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం సరికాదన్నారు. ప్రజాప్రభుత్వం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు తెలిపారని.. ఈక్రమంలో ఐదు కోట్ల ఆంధ్రులు తలదించుకునేలా ప్రవర్తించడం సరికాదన్నారు.
పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్’
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra pradesh News and Latest Telugu News
Updated Date - Jul 25 , 2024 | 11:32 AM