Ambani-Adani collaboration: అదానీ-అంబానీ భాయ్ భాయ్
ABN, Publish Date - Mar 29 , 2024 | 02:51 AM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ. దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరూ గుజరాతీలు. ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు...
అదానీ పవర్ ఎంపీ యూనిట్‌లో అంబానీకి వాటా
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani), అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ (Gautam Adani). దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరూ గుజరాతీలు. ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్‌లో అదానీ పవర్ అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ (ఎంఈఎల్) ఈక్విటీలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 26 శాతం వాటాను రూ.50 కోట్లకు కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ పారిశ్రామిక దిగ్గజాలు చేతులు కలపడం ఇదే మొదటిసారి.
ఎందుకంటే..
అదానీ పవర్ మధ్యప్రదేశ్‌లోని ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టును 2,800 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మిస్తోంది. ఇందులో 500 మెగావాట్లను ఆర్‌ఐఎల్ తన సొంత అవసరాల కోసం వినియోగించుకోబోతోంది. అయితే ఏ ప్రాజెక్టు అవసరాల కోసం ఆర్‌ఐఎల్ ఈ విద్యుత్‌ను ఉపయోగించబోతోందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఒప్పందం కింద ఎంఈఎల్ 20 ఏళ్ల పాటు ఆర్‌ఐఎల్‌కు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. రెండు వారాల్లో ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ సంస్థల అనుమతులు లభించే అవకాశం ఉందని రెండు సంస్థలు తెలిపాయి.
అంబుజా సిమెంట్స్‌లో అదానీకి మరింత వాటా: అంబుజా సిమెంట్స్ ఈక్విటీలో అదానీ గ్రూప్ వాటా 63.1 శాతం నుంచి 66.7 శాతానికి పెరిగింది. ఇందుకోసం రూ.6,661 కోట్లతో 21.2 కోట్ల వారంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చుకుంది. అంబుజా సిమెంట్స్ డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ నిధులతో 2028 నాటికి అంబుజా సిమెంట్స్ తన వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 14 కోట్ల టన్నులకు పెంచుకునేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.
కాగా అదానీ గ్రూప్ రాగి (కాపర్) ఉత్పత్తిలోకి ప్రవేశించింది. గుజరాత్‌లో ముంద్రా వద్ద 5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో కచ్ కాపర్ పేరుతో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది.
Updated Date - Mar 29 , 2024 | 07:49 AM