Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..
ABN , Publish Date - Dec 08 , 2024 | 12:26 PM
పలు రాష్ట్రాల్లో ఉచిత పథకాల ధోరణిపై ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది క్రమంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని తెలిపింది. అయితే ఎందుకు దీని ప్రస్తావన వచ్చిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశంలో ఎన్నికల్లో గెలుపొందేందుకు ఉచిత పథకాలను (Free Government Schemes) ప్రకటించడం రాజకీయ పార్టీలకు సర్వసాధారణంగా మారింది. ఈ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు కృషి చేస్తున్నాయి. ఈ వ్యూహం ఎన్నికల విజయానికి దారితీసినప్పటికీ, ఆయా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక శాఖ హెచ్చరిస్తోంది. అవసరమైతే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవచ్చని ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రతి మహిళలకు..
మహారాష్ట్ర ఎన్నికలే ఇందుకు తాజా ఉదాహరణ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ దీని మిత్రపక్షాలు 2.5 కోట్ల మంది మహిళలకు నెలవారీ రూ. 1,500 సహాయం అందించే పథకాన్ని ప్రారంభించాయి. గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి మద్దతు పొందడం ఈ స్కీం లక్ష్యం. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత భారీ పునరాగమనం చేసిన బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' (MMMSY) కింద మహిళలకు ప్రతి నెలా రూ. 1,000 ఇవ్వాలని యోచిస్తోంది. 18 ఏళ్లు పైబడిన మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు.
కేంద్ర ప్రభుత్వ జోక్యం
అయితే దీనిపై ఢిల్లీ ఆర్థిక శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పథకం కోసం ఏటా రూ. 4,560 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. ఇప్పటికే సబ్సిడీలపై రూ. 11,000 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వ బడ్జెట్‌పై ఇది మరింత భారం పడనుందని అంటున్నారు. ఈ పథకం అమలైతే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వ లోటు బడ్జెట్ పెరగవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవలసి ఉంటుందని చెబుతోంది. ఇది ఢిల్లీ ఆర్థిక స్వయంప్రతిపత్తిపై ప్రభావం చూపుతుంది. ఢిల్లీ ఇతర రాష్ట్రాల మాదిరిగా మార్కెట్ నుంచి రుణం తీసుకోవడానికి అనుమతి ఉండదు.
ఆర్థిక భారం
జాతీయ చిన్న పొదుపు నిధిని ఆశ్రయించవలసి ఉంటుంది. మరోవైపు అదనంగా ఢిల్లీ జల్ బోర్డు కోసం రూ. 2,500 కోట్ల గ్రాంట్ అవసరం. MMMSYకి సంబంధించిన ఖర్చులు రాష్ట్రంపై రూ. 7,000 కోట్ల అదనపు భారాన్ని మోపుతాయి. ఇలాంటి పథకాలు స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలను అందిస్తూనే, రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్న పలు ఉచిత స్కీంల గురించి కూడా ఆర్థిక నిపుణులు ప్రస్తావించారు. ఇలాంటి స్కీం వల్ల ఆయా రాష్ట్రాలపై ఆర్థిక భారం ఎక్కువగా పడటంతోపాటు వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News