Sattenapalli: ఘోరం.. పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని భర్త ఏం చేశాడంటే..
ABN, Publish Date - Nov 20 , 2024 | 04:04 PM
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలానికి చెందిన కోటి స్వాములు, అంకమ్మకు కొన్నేళ్ల కిందట వివాహం అయ్యింది. కొన్నాళ్లపాటు బాగానే సాగిన వారి వివాహ జీవితంలో మెల్లిగా మనస్పర్థలు మెుదలయ్యాయి. దీంతో వారు తరచూ గొడవ పడుతుండేవారు.
పల్నాడు: ఆధునిక సమాజంలో భార్యభర్తల బంధం చిగురుటాకుపై నీటి బిందువుల్లా మారిపోయింది. వేదమంత్రాల నడుమ బంధువుల సమక్షంలో జీవితాంతం కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్న భార్యభర్తలు చిన్నచిన్న కారణాలతో విడిపోతున్నారు. కొన్ని బంధాలు మధ్యలోనే అర్ధాంతరంగా ముగిపోతుంటే.. మరికొంత మంది ఘర్షణ పడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. భేదాభిప్రాయాలతో కేసులు పెట్టుకుంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. భాగస్వామి వేధింపులు తట్టుకోలేక ఇంకొంత మంది మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు.
తాజాగా అటువంటి ఘటనే ఒకటి పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. తరచూ ఘర్షణలు పడుతూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు దంపతులు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తానం చెందిన భర్త దారుణ నిర్ణయం తీసుకున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలానికి చెందిన కోటి స్వాములు, అంకమ్మకు కొన్నేళ్ల కిందట వివాహం అయ్యింది. కొన్నాళ్లపాటు బాగానే సాగిన వారి వివాహ జీవితంలో మెల్లిగా మనస్పర్థలు మెుదలయ్యాయి. దీంతో వారు తరచూ గొడవ పడుతుండేవారు. పెద్దలు సర్దిచెబుతుండడంతో మళ్లీ ఒక్కటవుతూ ముందుకు సాగుతుండేవారు. అయితే ఇటీవల మళ్లీ వారి మధ్య వివాదం నెలకొంది. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో అంకమ్మ భర్తతో ఇక కలిసి ఉండేది లేదంటూ సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కోటి స్వాములును పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అలాగే ఇరువర్గాల పెద్దలనూ పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే తనపై పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేయడం, పెద్దల సమక్షంలో మళ్లీ పంచాయితీ పెట్టడంపై కోటి స్వాములు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో స్టేషన్ ఎదుటే పురుగులమందు తాగి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు హుటాహుటిన కోటి స్వాములును ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నగర యువకుడి మృతి
Updated Date - Nov 20 , 2024 | 04:06 PM