Devotional: మెట్టినింటికి వెళ్లిన సోదరి కోసం ఓ పండుగ..
ABN , Publish Date - Oct 31 , 2024 | 07:36 AM
అనుబంధాలకు, ఆప్యాయతలకు, అనురాగాలకు నిదర్శనం భగినీహస్తభోజనం. వివాహబంధాలతో దూరమైన సోదరిని కనీసం ఎడాదికోక్కసారైన కలుసుకుని వారితోగడిపే అవకాశం అదే మన సంస్కృతీ. ఎన్నిపనులున్నా ఈ సంప్రదాయం వదలకూడదు.
హైదరాబాద్: ప్రతి పండగ వెనక ఒక పరమార్థం ఉంటుంది. దసరా దుష్ట సంహారానికి, దీపావళి జీవితాల్లో కాంతులు నింపడానికి.. ఇలా ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. 'భగినీ హస్త భోజనం' కూడా అలాంటిదే..
అనుబంధాలకు, ఆప్యాయతలకు, అనురాగాలకు నిదర్శనం భగినీహస్తభోజనం. వివాహబంధాలతో దూరమైన సోదరిని కనీసం ఏడాదికోక్కసారైన కలుసుకుని వారితోగడిపే అవకాశం. ఎన్నిపనులున్నా ఈ సంప్రదాయాన్ని వదలకూడదనేది పెద్దల మాట.
‘భగిని’ అంటే సోదరి(అక్క లేదా చెల్లెలు). ‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనమని అర్థం. అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అనే పండుగను జరుపుకుంటారు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అని అంటారు. అంటే సోదరి తన ఇంట్లోనే భోజనం చేయడం అన్నమాట. ఈ ఏడాది నవంబర్న 3న(ఆదివారం) ఈ పండుగ వస్తోంది.
పురాణాల ప్రకారం..
సూర్యుడి బిడ్డలైన యమునానది, యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకు ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలిచి సత్కారించాలని కోరిక. యమధర్మరాజుకు తీరిక దొరక్క పోవడంతో.. ఆమె కోరిక చానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేది. ఇదిలా ఉండగా యమధర్మరాజు.. యమున ఇంటికి ఒకరోజు సపరివార కుటుంబసమేతంగా వచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ రోజు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుడిని యమున పూజించి.. వారి కుటుంబం అందరికీ తన చేత్తో వంట చేసి వడ్డించింది.
సంతృప్తి పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమంటాడు. కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని యమున కోరింది. యమధర్మరాజు ఆమె కోరికను విని, ఆనందించి సోదరులు.. సోదరి క్షేమాన్ని ఎల్లప్పుడూ కోరుకోవాలి కాబట్టి ఆ రోజు ఏ సోదరి తన ఇంట సోదరుడికి తన చేతివంటకాల్ని రుచి చూపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చాడట. అందువల్లే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. మరునాడు యమునను పరివార సమేతంగా తన పురానికి ఆహ్వానించి కానుకాలు ఇచ్చాడు. షడ్రసోపేతమైన విందుతోపాటు సోదరికి సారె పెట్టి మెట్టినింటికి సాగనంపాడు. అప్పటి నుంచి భగినీ హస్త భోజనం పండగ జరుపుకుంటున్నారట.
దూరమవుతున్న బంధాలు..
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగలు వచ్చినప్పుడు ఒకచోట చేరి భోజనం చేస్తూ, కబుర్లతో కాలక్షేపం చేస్తూ పరస్పరం సంబంధాలను, అనుబంధాలను పెంచుకునేవారు. అటువంటి బంధాలన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. అందుకే కుటుంబసభ్యుల మధ్య అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికోరోజైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది ఈ భగినీ హస్త భోజన పండగ ఉద్దేశం. ఇలాంటి పవిత్ర ఆచారాన్ని పాటించడం వల్ల ఆధ్యాత్మిక లాభాలతోపాటు, సామాజిక బంధాలుకూడా మరింత బలపడి, సమాజంలో శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.
- చిదిరే శ్యామ్ నాథ్ శర్మ, అందోల్, సంగారెడ్డి జిల్లా