Durga Maa: ఇంద్రకీలాద్రిపై పకడ్బందీ ఏర్పాట్లు.. ఇప్పటివరకూ ఎంత మంది దర్శించుకున్నారంటే..
ABN, Publish Date - Oct 05 , 2024 | 04:55 PM
దసరా ఉత్సవాల తొలిరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని 49వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు వెల్లడించారు. రెండో రోజు అమ్మవారిని 65వేల మంది దర్శించుకున్నారని ఆయన తెలిపారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గామాత ఉత్సవాలు మూడో రోజు వైభవోపేతంగా సాగుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు. రెండ్రోజులుగా ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లలో మార్పులు చేసి పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండడమే తమ ఉద్దేశమని సృజన వెల్లడించారు. వీఐపీ భక్తులు తమ టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని కోరారు. అలాగే ఉత్సవ కమిటీ సభ్యులకూ ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఆదివారం నుంచి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సృజన వెల్లడించారు.
ఇప్పటివరకూ..
మరోవైపు ఉత్సవాల తొలిరోజు అమ్మవారిని 49వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు వెల్లడించారు. రెండో రోజు అమ్మవారిని 65వేల మంది దర్శించుకున్నారని ఆయన తెలిపారు. ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 36వేల మంది అమ్మవారిని కళ్లారా చూసి తరించారని ఈవో పేర్కొన్నారు. మూలానక్షత్రం రోజున భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. గత రెండ్రోజుల్లో 28వేల మంది అన్నప్రసాదం స్వీకరించారని, 3,952మంది కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. 1,39,906 అమ్మవారి లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని రామారావు తెలిపారు. ఇంకా లక్షన్నరకు పైగా లడ్డూలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 6లడ్డూలను కలిపి ఒక ప్యాకింగ్ రూపంలో అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చూస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు వెల్లడించారు.
పటిష్ట ఏర్పాట్లు..
అమ్మవారి ఉత్సవాల సందర్భంగా విజయవాడ నగరవ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు సహా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. సామాన్య భక్తులకు మంచి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రూ.500 దర్శనం ఆలస్యం అవుతుండగా.. రూ.300ల క్యూలైన్ దర్శనం త్వరితగతిన జరుగుతోందని సీపీ తెలిపారు. క్యూలైన్లలో పద్ధతి పాటించకుండా ప్రవేశించే భక్తులను నియంత్రిస్తున్నట్లు రాజశేఖర్ బాబు చెప్పారు.
ప్రత్యేక యాప్..
పోలీస్ యూనిఫామ్‌లో ఎవరైనా దర్శనానికి వెళ్తే ఊరుకునేది లేదని సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. వీఐపీ దర్శనాల కోసం యాప్ అందుబాటులోకి తెచ్చామని, వీఐపీలు టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనం చేసుకోవాలని ఆయన చెప్పారు. వారికి కొంత అసౌకర్యం కలిగినా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ట్రాఫిక్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాజశేఖర్ బాబు తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నట్లు ఆయన తెలిపారు. మూలానక్షత్రం రోజున మరింత పకడ్బందీగా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. అమ్మవారి ఉత్సవాల్లో చిన్నచిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Durga Maa: రూ.16.5 లక్షల విలువైన మంగళసూత్రం.. ఎవరు చేయించారంటే..
Pawan Kalyan: ఒక్క సభతో ప్రజల దృష్టిని ఆకర్షించిన పవన్..
Updated Date - Oct 05 , 2024 | 04:58 PM