Share News

Human Rights : కన్నభిరాన్‌ సార్‌ను మరచిపోగలమా!

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:48 AM

సమాజంలో సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం నెలకొన్నప్పుడు, ప్రభుత్వం బాధ్యతారహితంగా నడుచుకుంటున్నప్పుడు, అయ్యో ఇట్లా అవుతోందే అని మనం అనుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రముఖ పౌరహక్కుల నేత, న్యాయవాది కె.జి. కన్నభిరాన్‌ ఉంటే బాగుండు అని తలచుకుంటూనే ఉన్నాం.

Human Rights : కన్నభిరాన్‌ సార్‌ను మరచిపోగలమా!

మాజంలో సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం నెలకొన్నప్పుడు, ప్రభుత్వం బాధ్యతారహితంగా నడుచుకుంటున్నప్పుడు, అయ్యో ఇట్లా అవుతోందే అని మనం అనుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రముఖ పౌరహక్కుల నేత, న్యాయవాది కె.జి. కన్నభిరాన్‌ ఉంటే బాగుండు అని తలచుకుంటూనే ఉన్నాం. సామాజిక హితవు కోరి, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు తమ మాట విన్నా, వినకపోయినా, దేశంలో సంక్లిష్ట పరిస్థితి తలెత్తినప్పుడు తమ బాధ్యతగా పరిస్థితి చక్కబెట్టడానికి జోక్యం చేసుకున్న ప్రజాస్వామిక వాదులైన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌, జస్టిస్‌ వి.ఎం. తార్కుండేల తర్వాత కన్నభిరాన్‌ను పేర్కొనడంలో అతిశయోక్తి లేదేమో.

ప్రజల హక్కుల కోసం గళమెత్తుతూ ప్రభుత్వం అమలుపరుస్తున్న విచ్చలవిడి హింసా విధానాలను, చట్ట వ్యతిరేక పాలనను వ్యతిరేకించడమే కాకుండా, ప్రభుత్వానికి సూచనల రూపంలో ఆయన హితవు పలికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1987లో తూర్పుగోదావరి జిల్లా గుర్తేడు అటవీ ప్రాంతంలో పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు జైళ్లలో ఉన్న తమ పార్టీ సభ్యుల విడుదలకై సాంఘిక సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆర్‌. శంకరన్‌తో పాటు 25 మంది అధికారులను కిడ్నాప్‌ చేశారు. అప్పుడు పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కన్నభిరాన్‌ను జోక్యం చేసుకోమని ప్రభుత్వం కోరింది. అప్పట్లో ప్రయివేటుగా జరుగుతున్న స‍ంఘటనల్లో హక్కుల సంఘం జోక్యం చేసుకోరాదనే అవగాహన ఉండేది.


అయినా పేద ప్రజల అవసరాలు చూసే అధికారి, ఆయన బృందాన్ని కాపాడడం ధర్మంగా సార్‌ జోక్యం చేసుకున్నారు. కార్యవర్గంలో చర్చ లేకుండా ఎలా జోక్యం చేసుకుంటారని కొందరు సభ్యులు ప్రశ్నించారు. అయినా సార్‌ ఆ విమర్శకు జవాబు చెప్పి, కొన్ని సందర్భాలలో హక్కుల సంఘం మానవాళి సంక్షేమం కోసం తన పరిధులను దాటి పని చేయవలసి ఉంటుంది అన్నారు. 1993లో కొయ్యూరు కిడ్నాప్‌ సంఘటనలో ఆదివాసీ ప్రజాప్రతినిధి బాలరాజుతో పాటు, అధికారులు కిడ్నాప్‌కు గురైనప్పుడు, తర్వాత వరంగల్‌, కరీంనగర్‌లలో జరిగిన కొన్ని కిడ్నాప్‌ సంఘటనల్లో పౌరహక్కుల సంఘం బాధ్యులు జోక్యం చేసుకుని ఉద్రిక్తతలు తగ్గడానికి కృషి చేశారు. ఇటువంటి పనులు కూడా పౌర హక్కుల సంఘాలు చేపట్టాలనే ఒక సూత్రాన్ని కన్నభిరాన్‌ సార్‌ ఏర్పరిచారు. తర్వాత కాలంలో విప్లవ గ్రూప్‌ల సభ్యులు ఒకరినొకరు హతమార్చుకునే విషయంలో జోక్యం చేసుకోవడం సులభతరం అయింది.


1992లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీపుల్స్‌వార్‌ పార్టీని, నాటి ప్రజాసంఘాలను నిషేధించింది. 1994లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ నిషేధాన్ని ఎత్తివేయాలనే ప్రతిపాదనతో స్వామి అగ్నివేశ్‌, కాళోజీ నారాయణరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, కన్నభిరాన్‌ల బృందం ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లింది. నిషేధం ఎత్తివేసే విషయం చర్చిస్తూ ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాంసం అమ్మే వ్యాపారిలా ప్రజాపాలన సాగిస్తున్నారు. దీన్ని చట్టబద్ధ పాలన అంటారా’ అని ప్రశ్నించారట. అంతేకాకుండా ‘ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెపుతున్నారు, ప్రజలలో ఉండి ప్రజల సమస్యలపై పనిచేస్తున్న నక్సలైట్‌ పార్టీ నిషేధానికి గురై ఉంది, పాలన అంటే ఇదేనా’ అని నిలదీశారట. పక్కనే రూంలో ఉన్న నిఘా డీజీ దొరను కూడా సంప్రదించకుండా ‘కోపం వద్దు కన్నభిరాన్‌ గారు, మా ప్రభుత్వం పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేస్తుంది’ అని ఎన్టీఆర్‌ ప్రకటించారట. కన్నభిరాన్‌ ఎప్పుడూ ఒక న్యాయ ఆగ్రహాన్ని ప్రదర్శించేవారు.


చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రపంచ బ్యాంకు ఆయనకు అప్పులు ఇస్తూ చాలా సంస్కరణలతో కూడిన పరిపాలనా పద్ధతులు అమలుపరచాలని సూచించింది. అక్టోబర్‌ 2003లో అలిపిరి వద్ద పీపుల్స్‌వార్‌ పార్టీ చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో బాలగోపాల్‌, కన్నభిరాన్‌... ప్రపంచబ్యాంకు చైర్మన్‌కు ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సలహాతో పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చిందని, దాని ఫలితంగా ప్రజల వైవిధ్యమైన జీవితాలు, వాళ్ల జీవనోపాధులు ఎలా విధ్వంసానికి గురౌతున్నాయో ఆ లేఖలో రాశారు. అలాగే సామాజిక ఆందోళనలను, నక్సలైట్‌ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్న బ్యాంకు సలహా గురించి, ఫలితంగా 1629 మంది నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్య చేయడం, దీనికి ప్రతిగా చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్ల దాడి తదితర అంశాలు ఆ లేఖలో వివరంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు అప్పు అందించకపోతేనే ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉంటారని రాశారు.


హింస–ప్రతిహింసల వలయంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, నక్సలైట్‌ పార్టీలు శాంతి ఏర్పరచడానికి చర్చలు పరిష్కారం అని పౌరస్పందన వేదిక చేసిన ప్రయత్నం మనకు తెలిసిందే. ఈ ప్రయత్నంలో సంస్థ కన్వీనర్‌గా వ్యవహరించిన ఎస్‌.ఆర్‌ శంకరన్‌, ఇతర 12 మంది సభ్యులతో పాటు కన్నభిరాన్‌ నిర్వహించిన పాత్ర ముఖ్యమైనది.

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయడం, ‍‍‍సుప్రీం తీర్పులు రాజ్యాంగం పొందుపరచిన న్యాయం, చట్టాల వెలుగులో వెలువడక, విశ్వాసాల ప్రాతిపదికన వెలువడడం మనల్ని కలవరపెడుతోంది. ఈ అన్ని సందర్భాలలోనూ కన్నభిరాన్‌ను మళ్లీ మళ్లీ గుర్తుకుతెచ్చుకుంటూనే ఉంటాం. ఆయనకు మానవహక్కుల సెల్యూట్‌.

ఎస్‌. జీవన్‌కుమార్‌

మానవ హక్కుల వేదిక

(30 డిసెంబర్‌ : కన్నభిరాన్‌ వర్ధంతి)

Updated Date - Dec 28 , 2024 | 12:48 AM