Raghunandan Rao: కొట్లాడేటోడు కావాలా.. కాళ్లు మొక్కుతా అనే బానిస కావాలా..?
ABN, Publish Date - Apr 25 , 2024 | 04:30 PM
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మారు పేరు అని మండిపడ్డారు. మెజార్టీ ప్రజల హక్కులను ఆ పార్టీ కాలరాసిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని అడిగారు.
సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మారు పేరు అని మండిపడ్డారు. మెజార్టీ ప్రజల హక్కులను ఆ పార్టీ కాలరాసిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని అడిగారు. రూ.4 వేల పెన్షన్ సంగతి ఏంటి అని అడిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం నయవంచన అని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. చెప్పిన ప్రతి పని చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాన్ని ప్రారంభించారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో మీ ప్రతినిధిగా కొట్లాడేటోడు కావాలో.. బాంచన్ కాళ్లు మొక్కుతా అనే బానిస కావాలో ఆలోచించాలని ఓటర్లకు సూచించారు. నెల రోజుల్లో నాలుగు పార్టీలు మారిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అని విమర్శించారు. రఘునందన్ రావుకు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాల జనసభ నిర్వహించారు. ఆ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీపై రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని వివరించారు. ధరణి పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మించే సమయంలో ఆయా ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో పలు ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఏ రోజు కూడా డీసీఎంలలో పోలీసుల ద్వారా నిర్వాసితులను అర్ధరాత్రి దౌర్జన్యంగా ఖాళీ చేయించలేదని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 2021లో కేసీఆర్ కాళ్ళు మొక్కి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారని వివరించారు. మూడేళ్లలో ఒక్క పని కూడా చేయలేదని రఘునందన్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి సేవ చేస్తానని చెబితే నమ్మవారు ఎవరూ లేరు. బీఆర్ఎస్ పార్టీ తీరు గురించి హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డిని నిలదీయాలి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొడుతుంటే ఇక్కడి ఎమ్మెల్యే హరీశ్ రావు ఏం చేస్తున్నారని రఘునందన్ రావు నిలదీశారు. గత 40 ఏళ్లుగా కల్వకుంట్ల కుటుంబం కబంధ హస్తాలో సిద్దిపేట చిక్కుకుందని గుర్తుచేశారు. సిద్దిపేటకు విముక్తి కలిగించాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 25 , 2024 | 04:30 PM