Share News

Heart Stroke: బాత్రూంలోనే ఎక్కువగా గుండెపోటు ఎందుకొస్తుంది.. అందుకు కారణాలేంటి?

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:41 PM

ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గతంలో ఈ సమస్య కేవలం వృద్ధులకే ఉండేదని అనుకునేవాళ్లం గానీ.. ఈరోజుల్లో యువకులు...

Heart Stroke: బాత్రూంలోనే ఎక్కువగా గుండెపోటు ఎందుకొస్తుంది.. అందుకు కారణాలేంటి?
Why Heart Stroke Chances Are High In Bathrooms

ఈ మధ్య కాలంలో గుండెపోటు (Heart Stroke) కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గతంలో ఈ సమస్య కేవలం వృద్ధులకే ఉండేదని అనుకునేవాళ్లం గానీ.. ఈరోజుల్లో యువకులు సైతం దీని బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు వంటి ఎన్నో కారణాల వల్ల ఈ గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే.. ఓ అధ్యయనం మాత్రం ఈ విషయంపై మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. బాత్రూంలలోనే ఎక్కువగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, ఇందుకు మనం చేసే ఓ తప్పిదమే కారణమని హెచ్చరించింది.


బాత్రూంలో గుండెపోటుకి ప్రధానం కారణం

సాధారణంగా మనం బాత్రూంలో స్నానం చేసేటప్పుడు.. ముందుగా నీళ్లను తలపై పోసుకుంటాం. తలపై నీళ్లు పోసుకుంటే శరీరం మొత్తం తడుస్తుందన్న ఉద్దేశంతో స్నానం తల నుంచే మొదలుపెడతాం. అయితే.. ఇలా స్నానం చేయడం వల్ల రక్తం ఒక్కసారిగా తలపైకి చేరుతుందని, పర్యవసానంగా ధమనులు చిట్లిపోతాయని మెడికల్ అసోసియేషన్ ఆఫ్ కెనడా జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. కాబట్టి బాత్‌రూమ్‌ల్లో గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ పద్ధతిలో స్నానం చేస్తే ‘మిని స్ట్రోక్’ లేదా అంతకుమించి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన కొన్ని అధ్యయనాలు.. బాత్రూంలలో స్నానం చేసే సమయంలో గుండెపోటు మరణాలు లేదా పక్షవాతం బారిన పడుతున్న కేసులు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయని వెల్లడించాయి. స్నానం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు క్రమం తప్పకుండా పాటించకపోతే.. కచ్ఛితంగా ఏదో ఒక రోజు గుండెపోటుతో మరణించడం తథ్యమని ఆ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మన శరీర ఉష్ణోగ్రత బాహ్య ఉష్ణోగ్రతతో అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. మనం తలపై నీళ్లు పోసుకుంటే.. శరీరంలో రక్తప్రసరణ పెరిగి, అదే టైంలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.


ఈ పద్ధతిలో స్నానం చేయాలి

కాబట్టి.. స్నానం చేసే ప్రక్రియలో నేరుగా తలపై నీళ్లు పోసుకోకూడదు. తొలుత మన నడుము భాగం నుంచి పాదాలపై, అనంతరం భుజాలపై నుంచి నీళ్లు పోసుకోవాలి. ఫైనల్‌గా.. తలపై నీళ్లు పోసుకోవచ్చు. ఈ పద్ధతిలో స్నానం చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని, గుండెపోటుని నివారించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా.. రక్తపోటు, మైగ్రేన్, కొలెస్టిరాల్ సమస్యలతో బాధపడేవారు ఈ ప్రక్రియలోనే స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read Latest Health News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 04:41 PM