Sonia Gandhi : నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా !
ABN , Publish Date - May 18 , 2024 | 04:12 AM
‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్‌బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
20ఏళ్లు నన్ను ఆదరించారు.. నా కుమారుడినీ అలాగే చూడండి
నా దగ్గర ఉన్నదంతా మీరిచ్చిందే.. రాయ్‌బరేలీలో సోనియాగాంధీ
రాయ్‌బరేలీ, మే 17: ‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్‌బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. వరుసగా 20 ఏళ్లపాటుగా ఎంపీగా తనకు అవకాశం ఇచ్చినందుకు రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా కృతజ్ఞతలు తెలిపారు శుక్రవారం ఇక్కడ జరిగిన ప్రచార సభలో రాహుల్, ప్రియాంకతో కలిసి ఆమె పాల్గొన్నారు.
‘ నా దగ్గర ఉన్న ప్రతిదీ మీరు ఇచ్చిందే. అందరినీ ఆదరించాలని, బలహీనులకు అండగా ఉండాలని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని మీరూ (రాయ్‌బరేలీ ప్రజలు), ఇందిరాగాంధీ నాకు నేర్పించారు. అవే పాఠాలు నేను నా పిల్లలు రాహుల్, ప్రియాంకలకు కూడా బోధించాను. నన్ను ఆదరించినట్టే రాహుల్‌ను కూడా చూడండి’ అంటూ ఒకింత ఉద్వేగానికి సోనియా గురయ్యారు.