Bengaluru : ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్’ పోస్టర్లు విడుదల
ABN, Publish Date - Jul 14 , 2024 | 03:32 AM
దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు....
బెంగళూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు భాగస్వాములు అవుతారు. 80కు పైగా చర్చాగోష్టులు జరగనున్నాయని సీనియర్ సాహితీ పరిశోధకుడు నాడోజా హంపా నాగరాజయ్య వెల్లడించారు.
బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో శనివారం బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ 2024కు సంబంధించి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. సాహితీవేత్తలు, పరిశోధకులు డాక్టర్ మల్లేపురం జి. వెంకటేశ్, డాక్టర్ నడహళ్లి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్య ఉత్సవ్ డైరెక్టర్, రచయిత సతీశ్ చప్పరికె పోస్టర్‌ను విడుదల చేశారు.
నగరంలోని కోరమంగల ప్రాంతం సెయింట్ జాన్ ఆడిటోరియంలో ఆగస్టు 9 నుంచి మూడు రోజులపాటు సాహిత్య ఉత్సవ్ జరగనుంది. డాక్టర్ నడహళ్లి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రపంచ సాహిత్యానికి కన్నడ, తెలుగు, తమిళ, మళయాళం భాషల సేవలు అపారమైనవని అన్నారు. చారిత్రాత్మకంగా మహత్తరమైన నాలుగు భాషలను ఒకే వేదికకు తీసుకొచ్చి పరస్పరం చర్చాగోష్టులు జరపడం ఈ ఉత్సవం ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
Updated Date - Jul 14 , 2024 | 03:32 AM