Share News

Arvind Kejriwal bail: ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:16 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Arvind Kejriwal bail: ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం

ఢిల్లీ, జులై 12: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడం ద్వారా బీజేపీ కుట్రను బట్టబయలు చేసినట్లు అయిందని ఆప్ నేతలు స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆప్ స్వాగతించింది. ఆ క్రమంలో సత్యమేవ జయతే అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అలాగే త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న సీఎం కేజ్రీవాల్ ఫొటోను సైతం దానికి జత చేసింది. దీనిపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచిదేవ స్పందించారు. సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చిందన్నారు.

అంతేకానీ ఆయన నిర్థోషిగా విడుదల కాలేదని ఆప్ నేతలకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలను దోచుకున్నారంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై వీరేంద్ర నిప్పులు చెరిగారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఈ అవినీతి కేసులో ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేసిందని.. అందుకే ఆయన జైలులోనే ఉన్నారని ఈ సందర్భంగా ఆప్ నేతలకు వీరేంద్ర గుర్తు చేశారు.

Also Read:Puja Khedkar: మనోరమా కేడ్కర్ తుపాకీతో హల్‌చల్.. వీడియో వైరల్


ఇంకోవైపు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై ఆ పార్టీ నేత, మంత్రి అతిషి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ పని చేయకుండా ఉండేందుకే.. ఆయనపై తప్పుడు కేసు పెట్టి జైల్లో ఉంచాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇక ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ స్పందించారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. మద్యం పాలసీ కేసు బీజేపీ చేస్తున్న సర్క్‌స్‌ అని ఆయన పేర్కొన్నారు. అయితే బీజేపీ కుట్ర ద్వారా నిర్మితమైన మద్యం కుంభకోణం కేసును సుప్రీంకోర్టు కొట్టి వేయాలని ఆయన ఆకాంక్షించారు.

ఇక కేజ్రీవాల్‌కు గతంలో బెయిల్ మంజురు చేస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సదరు కోర్టు పేర్కొన్న పలు అంశాలను ఈ సందర్భంగా పాఠక్ ప్రస్తావించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. తప్పుడు కేసులు నమోదు చేసి.. ఎంత కాలం నిజాన్ని జైళ్లలో బంధించగలరు మోదీ జీ అంటూ ప్రశ్నించారు. మీ నియాంత పాలనను దేశంలోని యావత్ ప్రజానీకం చూస్తుందన్నారు. ఈడీ కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ప్రతీ ఒక్కరు కేజ్రీవాల్‌పై తప్పుడు కేసు నమోదు చేసిందని నమ్ముతున్నారన్నారు. అయితే సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో.. నిజం గెలిచిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వలోని మరో మంత్రి సురజ్ భరద్వాజ మాట్లాడుతూ.. ఇది బీజేపీకి ఒక పెద్ద గుణపాఠమని అభిప్రాయపడ్డారు.

Also Read: Punjab: ఎంపీ అమృత్ పాల్ సింగ్ సోదరుడు అరెస్ట్


ఇక ఆప్ నేతల మాటల దాడిపై బీజేపీ నేత, ఎంపీ బన్సురీ స్వరాజ్ స్పందించారు. గతంలో పశువుల దాణా కుంభకోణంలో బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌ అరెస్టయ్యారని గుర్తు చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందని.. కానీ మళ్లీ అరెస్టయిన సందర్బాలున్నాయని ఈ సందర్బంగా ఆమె సోదాహరణగా వివరించారు. అయితే కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై ఢిల్లీ ప్రజలను తప్పుదొవ పట్టించే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్‌లాగేనే కేజ్రీవాల్ సైతం భవిష్యత్తులో జైలుకు వెళ్లక తప్పదని బన్సురీ స్వరాజ్ స్పష్టం చేశారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 04:22 PM