ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP : కమలం ఖుషీ

ABN, Publish Date - Oct 09 , 2024 | 04:38 AM

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టింది! ప్రీ పోల్‌, పోస్ట్‌ పోల్‌, ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల్ని తలకిందులు చేస్తూ.. రాజకీయ నిపుణుల విశ్లేషణలను అబద్ధం చేస్తూ.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది!

  • హరియాణాలో హ్యాట్రిక్‌ విజయం.. జమ్మూకశ్మీర్‌లో గణనీయంగా సీట్లు

  • ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మూడోసారి విజయం

  • హరియాణాలో 90 సీట్లకుగాను 48 స్థానాల్లో బీజేపీ గెలుపు

  • 37 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌.. ఖాతా తెరవని ఆప్‌

  • లెక్కింపులో తొలుత కాంగ్రెస్‌ జోరు.. తర్వాత పుంజుకున్న బీజేపీ

  • కాంగ్రెస్‌ భస్మాసుర హస్తం.. కుమ్ములాటలతో గెలుపు దూరం

  • హస్తంవైపు జాట్లు.. దాంతో బీజేపీవైపునకు జాటేతర వర్గాలు!

సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఒకింత నిరాశ చెందిన కమలనాథులకు.. హరియాణా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి! ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మరీ హరియాణాలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన బీజేపీ.. జమ్మూకశ్మీర్‌లో గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించి సత్తా చాటింది! రెండు చోట్లా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పాయి! హరియాణాలో కాంగ్రె్‌సదే విజయమని.. బీజేపీకి మళ్లీ అధికారం సుదూర స్వప్నమేనని.. జమ్మూకశ్మీర్‌లో హంగ్‌ తప్పదని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కానీ.. హరియాణాలో బీజేపీ గెలుపు ఢంకా మోగిస్తే.. జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి విజయనాదం చేసింది!! హరియాణాలో డకౌట్‌ అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. అనూహ్యంగా కశ్మీర్‌లో ఒక్క స్థానంతో బోణీ కొట్టింది.

‘‘ఈరోజు (మంగళవారం) శరన్నవరాత్రుల్లో ఆరో రోజు. చేతిలో కమలం పట్టుకుని, సింహవాహనాన్ని అధిరోహించిన కాత్యాయనీ మాతను ఆరాధించే రోజు. ఆ తల్లి మనందరినీ ఆశీర్వదించింది. ఈ పవిత్ర సమయంలో.. హరియాణాలో వరుసగా మూడోసారి కమలం వికసించింది. భగవద్గీత పుట్టిన గడ్డపై సత్యం, అభివృద్ధి గెలిచాయి. అబద్ధాల మూటపై అభివృద్ధి హామీ విజయం సాధించింది. ’’

- ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టింది! ప్రీ పోల్‌, పోస్ట్‌ పోల్‌, ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల్ని తలకిందులు చేస్తూ.. రాజకీయ నిపుణుల విశ్లేషణలను అబద్ధం చేస్తూ.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది! మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత కొంతసేపటి వరకూ కాంగ్రెస్‌ జోరు కనిపించినా.. బీజేపీ క్రమంగా పుంజుకుని రేసులో ముందుకు దూసుకుపోయింది.


మొత్తం 90 సీట్లకుగాను.. 48 స్థానాల్లో విజయఢంకా మోగించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూలు వెలువడినప్పటి నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ దాకా.. ప్రతి దశలోనూ గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. కేవలం 37 సీట్లకు పరిమితమై మరోసారి ఓటమి చేదును చవిచూసింది. ఐఎన్‌ఎల్‌డీ రెండు సీట్లతో సరిపెట్టుకోగా.. కాంగ్రె్‌సతో పొత్తు కుదరక సొంతంగా పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ డకౌట్‌ అయిపోయింది!

ఇక.. గత ఎన్నికల్లో 10 సీట్లు సాధించి కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించిన జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) ఈసారి ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడింది! సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా దారుణాతిదారుణంగా ఓడిపోయారు. ఇక.. ఈ ఎన్నికల్లో పోటీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన వినేశ్‌ ఫొగట్‌, సావిత్రి జిందాల్‌ గెలుపొందడం విశేషం.

కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వినేశ్‌ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి యోగేశ్‌ కుమార్‌పై 6,015 ఓట్ల తేడాతో గెలిచారు. భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్‌.. హిసార్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇంత సంతోషంలోనూ బీజేపీకి అసంతృప్తి కలిగించే విషయం.. ఆ పార్టీకి చెందిన 8 మంది మంత్రులు, స్పీకర్‌ ఓడిపోవడం. అటు హరియాణా కాంగ్రెస్‌ చీఫ్‌ ఉదయ్‌ భాన్‌, ఐఎన్‌ఎల్‌డీ చీఫ్‌ అభయ్‌ సింగ్‌ చౌతాలా కూడా ఓడిపోవడం గమనార్హం. కాగా.. 1966లో ఏర్పాటైన హరియాణాలో ఒక పార్టీ వరుసగా మూడోసారి గెలవడం ఇదే!


  • కాంగ్రెస్‌ స్వయంకృతం

హరియాణాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగా ఏర్పడిన వ్యతిరేకత, జాట్‌ సామాజికవర్గంలో ప్రభుత్వంపై నెలకొన్న ఆగ్రహం, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన క్రీడాకారుల్లో కొందరు రాజకీయ ఆరంగేట్రం చేసి కాంగ్రెస్‌ పక్షాన నిలబడడం, రైతు ఆందోళనలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం, అగ్నివీర్‌ పథకంపై అసంతృప్తి వంటి అనేక పరిణామాల నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే.. ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో వర్గపోరు వారి గెలుపు అవకాశాలకు దూరం చేసింది.

జాట్‌ వర్గం నేత భూపిందర్‌ సింగ్‌ హుడాకు దళిత వర్గం నేత కుమారి సెల్జాకు మధ్య విబేధాలు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం హుడాకు పూర్తి ేస్వచ్ఛనివ్వడంతో రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాల్లో 70 సీట్లు తన వర్గంవారికే ఇచ్చుకున్నారని.. ఇది కుమారి సెల్జాకే కాక, జాట్‌ వర్గానికే చెందిన రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలాకు సైతం మింగుడుపడలేదని చెబుతున్నారు. దీంతో, ఎవరికి వారు రెబల్‌ అభ్యర్థులను నిలబెట్టడంతో పార్టీకి నష్టం వాటిల్లింది. బీజేపీని కూడా రెబెల్‌ అభ్యర్థులు దెబ్బ తీశారు.


  • జాట్లు.. జాటేతరులు..

జాట్లు వర్సెస్‌ జాటేతర వర్గాలుగా చీలిపోయిన హరియాణా ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా విస్పష్టమైన తీర్పుచెప్పారు. జాట్లలో అత్యధికులు కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపగా.. జాటేతరుల్లో అత్యధికులు బీజేపీకి ఓటేయడంతో.. కమలనాథులు అనూహ్య విజయం సాధించారు. రెండు పార్టీల మధ్య ఓటు శాతం అత్యంత తక్కువగా ఉండడానికి కారణం ఇదే.

ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతుంటే.. మరోవైపు బీజేపీ తనదైన శైలిలో ఎన్నికల వ్యూహాలను అమలు చేసింది. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకు ఆమ్‌ ఆద్మీ, బీఎస్పీ రూపంలో గండి పడింది. ఇది బీజేపీకీ ఎంతగానో అనుకూలించగా, కాంగ్రె్‌సకు తీవ్రంగా నష్టం చేసింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్‌ హరియాణాలో మాత్రం ఒంటరిగా బరిలో దిగింది.

Updated Date - Oct 09 , 2024 | 06:19 AM