హరియాణా సీఎంగా నాయబ్‌ కొనసాగింపు?

ABN, Publish Date - Oct 09 , 2024 | 04:07 AM

హరియాణాలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఫలించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ.. సీఎంగా కొనసాగడం దాదాపు ఖాయమైంది.

హరియాణా సీఎంగా నాయబ్‌ కొనసాగింపు?

  • అలా వచ్చి ఇలా గెలిపించి

న్యూఢిల్లీ, అక్టోబరు 8: హరియాణాలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఫలించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ.. సీఎంగా కొనసాగడం దాదాపు ఖాయమైంది. ఓబీసీలను, జాట్‌లను ఆకర్షించడమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఓబీసీ నేత నయాబ్‌ సింగ్‌ సైనీ(54)ని ముఖ్యమంత్రిని చెయ్యడం బీజేపీకి లబ్ధి చేకూర్చింది. సైనీ పాలన కూడా కలిసి రావడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాలకే పరిమితైన రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. నిజానికి, సీఎం సైనీ 200 రోజుల పాలనతోనే ఈ మ్యాజిక్‌ సాధ్యమైందనేది విశ్లేషకుల అభిప్రాయం. మాజీ సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో మార్చి నెలలో సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

త్రివిధ దళాల్లో అగ్నివీర్‌గా పని చేసిన వారికి సర్వీస్‌ అనంతరం ఉపాధి కల్పనకు ఆమోదం, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే పంటల సంఖ్యను 24కు పెంచడం, విద్యుత్‌ బిల్లుల కనీస చార్జీల రద్దు వంటి సైనీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను గణనీయంగా తగ్గించాయి. సీఎం సైనీపై నమ్మకాన్ని పెంచేశాయి. ఇక, ఎన్నికల ప్రచారంలోనూ పార్టీని ముందుండి నడిపించిన సైనీ... బీజేపీ సాధించిన విజయాలను, ఎన్నికల హామీల అమలు అంశంలో తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల్లో పార్టీ విజయం సాధించగా సైనీ తిరుగులేని నేతగా ఎదిగారు. పార్టీకి తిరిగి అధికారమిస్తే సైనీనే ముఖ్యమంత్రిగా కొనసాగతారని ఎన్నికల ప్రచారంలో బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నయాబ్‌ సింగ్‌ సైనీ సీఎంగా కొనసాగడం లాంఛనమే..!!

Updated Date - Oct 09 , 2024 | 04:07 AM