Share News

Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ

ABN , Publish Date - Nov 19 , 2024 | 03:44 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఇక పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభంకానుంది. అలాంటి వేళ.. బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే.. ఓటర్లకు నగదు పంచుతున్నారంటూ బహుజన్ వికాస్ అఘాడీ ఆరోపించింది.

Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ

ముంబయి, నవంబర్19: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. మహారాష్ట్రలోని బీజేపీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పాల్ఘర్ జిల్లాలోని ఓటర్లకు నగదు పంపిణీ చేశారంటూ బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) ఆరోపించింది. అందుకోసం రూ. 5 కోట్ల ఆయన తీసుకు వచ్చారని తెలిపింది. బ్యాగ్‌లో నుంచి నగదు కట్టలను కార్యకర్తలు బయటకు తీశారంది. వీటిని సెల్ ఫోన్ల ద్వారా ఫొటోలు, వీడియోలు సైతం తీశారని పేర్కొంది. ఆ సమయంలో వినోద్ కొంత దూరంలో కూర్చున్నారని వివరించింది.


మంగళవారం నలసోపరాలోని ఓ హోటల్‌లో వినోద్ తావ్డే.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్ నాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ఆయన ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఓ ప్రచారం జరిగింది. దీంతో సదరు హోటల్‌లోకి బహుజన్ వికాస్ అఘాడీ శ్రేణులు దూసుకెళ్లాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


అయితే తాను నగదు పంచినట్లు వస్తున్న ఆరోపణలను వినోద్ తావ్డే ఈ సందర్భంగా ఖండించారు. మరోవైపు వినోద్ వద్ద నగదు బ్యాగ్‌తోపాటు డైరీలు ఉన్నాయని.. బహుజన వికాస్ అఘాడీ నేత హితేంద్ర ఠాగూర్ తెలిపారు. అందులో వసాయి రోడ్ 5, వసాయి వెస్ట్ 4 అని రాసి ఉందన్నారు. అలాగే సాయంత్రం 4.00 గంటలకు నగదు ఎక్కడికి పంపించాలో వివరాలు రాసి ఉన్నాయన్నారు. వినోద్ తావ్డే‌తోపాటు రాజన్ నాయక్‌లపై నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులను బముజన్ వికాస్ అఘాడీ నేతలు డిమాండ్ చేశారు.


బీజేపీ ఆట ముగిసింది

వినోద్ తావ్డే వ్యవహారంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌ స్పందించారు. బీజేపీ ఆట ముగిసిందన్నారు. ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని హితేంద్ర ఠాగూర్ చేశారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం.. తమ బ్యాగులను తనిఖీ చేస్తుంది.. కానీ అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.


బహుజన వికాస్ అఘాడీకి చెందిన పార్టీ శ్రేణులు హోటల్‌లోకి ప్రవేశించారు. ఉన్నతాధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. క్షితిజ్ ఠాకూర్‌తోపాటు అతని తండ్రి ఇద్దరూ హోటల్‌లోనే ఉన్నారన్నారు. వినోద్ తావ్డేను హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు బహుజన్ వికాస్ అఘాడీ అనుమతించడం లేదని చెప్పారు. ఈ సమయంలో ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని.. హోటల్‌ను సీల్ చేశారని వివరించారు.


స్పందించిన కాంగ్రెస్ పార్టీ..

ఇక ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సైతం స్పందించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే నగదు పంచుతూ పట్టబడ్డరని పేర్కొంది. అలాగే వినోద్ తావ్డే నగదుతో ఉన్న పలు వీడియోలు సైతం సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నాయంది. మహారాష్ట్రలో పోలింగ్‌కు ముందు బీజేపీ నేతలు నగదు సాయంతో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇందులో కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ ఉన్నారని విమర్శించింది. ఈ అంశంపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ సందర్భంగా డిమాండ్ చేసింది.

For National news And Telugu News

Updated Date - Nov 19 , 2024 | 04:07 PM