CBI : కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్
ABN, Publish Date - Jun 08 , 2024 | 05:00 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
పరిగణనలోకి తీసుకునే అంశంపై జూలై 6న విచారణ
జ్యుడీషియల్ కస్టడీ 21 వరకూ పొడిగింపు
న్యూఢిల్లీ, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై జూలై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు.
ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమెనివాసంలోనే ఈడీ అరెస్టు చేసింది. 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కవిత తిహాడ్ జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఆ తర్వాత కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా రౌస్‌అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేశారు.
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అయితే ఢిల్లీ మద్యం కేసులో కవితను ముందు సాక్షిగా మాత్రమే దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఆ తర్వాత ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఇటీవలే ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా ఈ నెల 3న పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయస్థానం తెలిపింది. ఇప్పుడు సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో శుక్రవారం కవితను జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. సీబీఐ విజ్ఞప్తి మేరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి కావేరి భవేజా వెల్లడించారు.
Updated Date - Jun 08 , 2024 | 05:00 AM