Share News

Central Committee : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం ఆత్మ పరిశీలన

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:10 AM

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది.

Central Committee : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం ఆత్మ పరిశీలన

న్యూఢిల్లీ, జూలై 6: ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది. జూన్‌ 28,29,30వ తేదీల్లో న్యూఢిల్లీలో భేటీ అయిన ఆ పార్టీ ముఖ్య నేతలతో కూడిన సెంట్రల్‌ కమిటీ ఓటమికి గల కారణాలను విశ్లేషించింది. ముఖ్యంగా తమ పార్టీకి ప్రథమ మద్దతుదారులైన శ్రామిక, పేద, మధ్యతరగతి వర్గాలు తమకు దూరం కావడానికి గల కారణాలను కమిటీ పరిశీలించింది. ఆ నివేదికను శనివారం విడుదల చేసింది.

కేరళలో అధిక శాతం మైనారిటీలు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారని, అలాగే యువత ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా ఆ రాష్ట్రంలో తమ పార్టీని దెబ్బకొట్టిందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ వ్యవస్థ బలహీనం కావడంతో అక్కడ ఓటమి చెందినట్లు నిర్ధారించింది. ఆ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఉనికే లేదని, 12 నుంచి 14% బూత్‌లలో పార్టీకి ఏజెంట్లే లేరని పేర్కొంది. అలాగే తృణముల్‌ కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలతో పేద వర్గాలు తమ నుంచి దూరంగా జరిగాయని నిర్ధారించింది. త్రిపురలో బీజేపీ గిరిజన రాజకీయాలు పురిగొల్పినందువల్లే ఓటమి చెందినట్లు పేర్కొంది. ఆయా రాష్ట్రాలతో పాటు దేశంలోని మిగతా చోట్ల క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సెంట్రల్‌ కమిటీ ఓ తీర్మానం చేసింది.

Updated Date - Jul 07 , 2024 | 07:29 AM