వైవాహిక అత్యాచారం నేరం కాదు
ABN, Publish Date - Oct 04 , 2024 | 05:12 AM
భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలన్న వినతిని గురువారం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
భార్య అనుమతి లేకుండా జరిపే శృంగారాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేం
నేరంగా గుర్తిస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం
వైవాహిక అత్యాచారంపై ఇతర చట్టాల ప్రకారం కేసులు పెట్టొచ్చు.. సుప్రీంకోర్టులో కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 3: భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలన్న వినతిని గురువారం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దాన్ని కూడా రేప్‌గా గుర్తించి అందుకు అనుగుణంగా శిక్ష వేస్తే అది అత్యంత తీవ్రమైన చర్య అవు తుందని తెలిపింది. దీన్ని ‘వైవాహిక అత్యాచారం’గా భావించవచ్చని, కానీ క్రిమినల్ నేరంగా గుర్తించలేమని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను సమర్పించింది. భార్య సమ్మతిలేని శారీరక సంబంధా న్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కోర్టుకు ఆ అభిప్రాయాన్ని తెలిపింది. వైవాహిక అత్యాచారం సామాజిక సమస్య అని, చట్టపరమైన అంశం కాదని పేర్కొంది. ఒకవేళ దీన్ని క్రిమినల్ నేరంగా గుర్తిస్తే అది సమాజంపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది.
అలాంటి సమస్య తలెత్తితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారమే శిక్షించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. గృహ హింసపై చట్టం కింద కేసు పెట్టవచ్చని తెలిపింది. రాష్ట్రాలు, భాగస్వాములు, అన్ని వర్గాలతో తగిన చర్చలు లేకుండా ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేసింది. వివాహం కాకముందు మహిళ సమ్మతి లేకుండా శారీరక సం బంధం పెట్టుకోవడం తీవ్రమైన నేరమని, అదే వివాహ వ్యవస్థలో పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపింది.
అయితే వివాహిత అనుమతి తీసుకోవా ల్సిన పనిలేదన్న భావన సరికాదని, ఒకవేళ అలాంటి చర్యకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. భర్త ద్వారా కలిగిన అవాంఛిత గర్భాన్ని తొలగించే విషయమై 2022లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ తొలిసారిగా ‘వైవాహిక అత్యాచారం’ అన్న భావనను ప్రస్తావించింది. దీనిని నేరంగా గుర్తిస్తూ గర్భస్రావానికి అనుమతి ఇచ్చింది. దానినీ రేప్‌లాగానే తీవ్రమైన నేరంగా పరిగణించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి.
Updated Date - Oct 04 , 2024 | 05:13 AM