CM Revanth : నిధులివ్వండి..
ABN, Publish Date - Jul 23 , 2024 | 05:27 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్‌కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
మూసీ పరిరక్షణకు రూ.10వేల కోట్లు కావాలి
నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు 16 వేల కోట్లు అవసరం.. జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి
ధాన్యం బకాయిలు 1,468 కోట్లు చెల్లించండి.. గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం.. అనుమతివ్వండి
కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు.. రాహుల్, ఖర్గేతో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణాన్ని వేగిరం చేయండి.. కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి
న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్‌కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మేర ప్రవాహిస్తున్న మూసీలో మురుగు నీరు చేరుతోందని, దీనిని శుద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. శ్రమశక్తి భవన్‌లో సోమవారం కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.
మూసీలో చేరే మురుగును శుద్ధి చేయడం, వరద నీటి కాల్వల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుందరీకరణకు సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా మూసీలో మురుగు నీటి శుద్ధి పనులకు రూ.4వేల కోట్లు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి జలాలతో నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6వేల కోట్లు కేటాయించాలని అభ్యర్థించారు. తెలంగాణలో 7.85లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వీటితోపాటు పీఎంఏవై కింద నిర్మించనున్న ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్లు అవసరమవుతాయని, జల్‌జీవన్ మిషన్ కింద నిధులు కేటాయించి విజ్ఞప్తి చేశారు. అలాగే, ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ కోరారు. 2014-15 ఖరీ్‌ఫలో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని, ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పించామని గుర్తుచేశారు.
పీఎం గరీబ్ కల్యాణ్ యోజనకు సంబంధించి 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987టన్నుల బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కోరారు. 2021 మే నుంచి 2022 మార్చి వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో కాకుండా పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పార్లమెంట్ హౌస్‌లోని కార్యాలయంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్‌దీ్‌పసింగ్ పురితో సీఎం భేటీ అయ్యారు.
తెలంగాణలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నామని గుర్తు చేస్తూ.. ఇందుకు సంబంధించిన సబ్సిడీని సంబంధిత కంపెనీలకు ముందుగానే చెల్లించే వెసులుబాటు కల్పించాలనికోరారు. తద్వారా లబ్ధిదారులకు నేరుగా రూ.500కే సిలిండర్ అందించే వీలు ఉంటుదన్నారు. అలా వీలుకానీ పక్షంలో తాము చెల్లించే సబ్సిడీని 48 గంటల్లోపు లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల్లో సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్, రఘురామిరెడ్డి, అధికారులు ఉన్నారు.
రాహుల్, ప్రియాంక, ఖర్గేతో రేవంత్, మంత్రుల భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కూడా ఉన్నారు. రుణమాఫీసహా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న తీరును రాహుల్, ప్రియాంకకు వివరించామని భట్టి తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీలో రూ.10లక్షల వరకు చికిత్స, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ తదితర హామీలను నెరవేర్చిన విషయాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు. హామీలను నెరవేర్చిన నేపథ్యంలో జనంలోకి వెళ్లాలని నిర్ణయించామని, ఈ మేరకు తెలంగాణలో నిర్వహించే బహిరంగ సభకు రావాలని రాహుల్‌ను ఆహ్వానించినట్లు చెప్పారు.
కాగా, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను వారికి వివరించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో క్రీడలకు ఈసారి గతంలోకంటే మూడింతలు ఎక్కువగా బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రాత్రి పదిగంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణాన్ని వేగవంతం చేయండి
కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రహదారుల నిర్మాణంపై మంత్రి కూలంకషంగా చర్చించారు.
నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించేందుకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్‌ఎ్‌ఫసీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని కోరారు. రాష్ట్రంలోని 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. నల్లగొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్‌ఎ్‌ఫసీ ఏర్పాటు చేస్తామని అనురాగ్ జైన్ హామీ ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
Updated Date - Jul 23 , 2024 | 05:29 AM