హరియాణా ఫలితాన్ని ఆమోదించం
ABN, Publish Date - Oct 09 , 2024 | 03:24 AM
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
ప్రజల ఆకాంక్షలకు భిన్నమైన ఫలితమిది
రౌండ్ల వారీ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం
ఈవీఎంల బ్యాటరీల చార్జింగ్‌లోనూ తేడాలు
మేం గెలిచిన స్థానాల్లో 60-70 శాతం
బీజేపీ గెలిచిన అన్ని చోట్లా 99 శాతం చార్జింగ్
ఇది ఎలా సాధ్యమైంది? ఈసీ వద్దకు వెళ్తాం..
కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్‌ఖేరా
న్యూఢిల్లీ, అక్టోబరు 8: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఎన్నికల ఫలితం దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థల సమగ్రతపైనే తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొంది. ప్రజల తీర్పును కాలరాసిన కుట్రలకు విజయం దక్కిందని ఆరోపించింది. ఎన్నికల ఫలితాల వెల్లడి, ఈవీఎం బ్యాటరీల్లో ఉన్న చార్జింగ్‌పై తీవ్రమైన అనుమానాలున్నాయని తెలిపింది. కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరాతో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘హరియాణా ఫలితాలు పూర్తిగా ఆశ్చర్యకరం, ఊహాతీతం. ఓట్ల లెక్కింపు సందర్భంగా రౌండ్ల వారీ ఫలితాల వెల్లడిలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. కనీసం 14 నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరుపై తమ పార్టీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
వాటిపై త్వరలో ఈసీకి ఫిర్యాదు చేస్తాం. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) స్థానిక అధికారులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చింది. తొలి రౌండ్లలో మంచి ఆధిక్యతలో ఉన్న మా అభ్యర్థులు 50, 100, 250 ఓట్ల తేడాతో ఓడిపోయారు అని జైరాం తెలిపారు. హరియాణా ఫలితాన్ని ఆమోదించబోమని, ఈ విషయం ఇక్కడితో ముగియలేదని స్పష్టం చేశారు. పవన్ ఖేరా మాట్లాడుతూ, ‘సాధారణంగా ఎక్కడైనా, కౌంటింగ్ నాటికి ఈవీఎంల బ్యాటరీల్లో చార్జింగ్ 60-70 శాతమే ఉంటుంది. హరియాణాలో మా పార్టీ గెలిచిన స్థానాల్లో ఉన్న ఈవీఎంల బ్యాటరీలు 60-70 శాతం చార్జింగ్‌తో ఉన్నాయి. కానీ, బీజేపీ అభ్యర్థులు గెలిచిన స్థానాల్లో ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్‌తో ఉన్నాయి.
పోలింగ్ తర్వాత వాటిల్లో 99ు చార్జింగ్ ఉండటం ఎలా సాధ్యం? అదీగాక బీజేపీ గెలిచిన అన్ని స్థానాల్లో ఒకే విధంగా 99% చార్జింగ్‌తో ఎలా ఉన్నాయి? అంటే, ఏదో జరిగింది. ఇది కుట్రల విజయం, ప్రజాస్వామ్య అపజయం’ అని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు తొలుత తాము ఈసీ వద్దకు వెళ్తామని, ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తామని జైరాం చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్ ఫలితాలపై స్పందిస్తూ.. ఏదో విధంగా మెజారిటీ సాధించాలనుకున్న బీజేపీ కుతంత్రాలను ఆ రాష్ట్ర ప్రజలు ఓడించారన్నారు.
ఈసీకి కాంగ్రెస్ లేఖ
హరియాణాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా రౌండ్ల వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించే విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని అంతకుముందు ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. ఈసీ స్పందిస్తూ.. ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగిందనటానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది.
Updated Date - Oct 09 , 2024 | 03:25 AM