Congress: కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ప్రజల ఆదరణ
ABN, Publish Date - Jun 05 , 2024 | 02:36 PM
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి బోటా బోటి మెజార్టీతో అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీ కేవలం 240 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతోంది. గత ఎన్నికలతో పోల్చితే సీట్ల సంఖ్య పెరిగింది.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి బోటా బోటి మెజార్టీతో అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం 240 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతోంది. గత ఎన్నికలతో పోల్చితే సీట్ల సంఖ్య పెరిగింది. ఆ పార్టీ కంచుకోట అయిన అమేథీ, రాయ్ బరేలిలో విజయం సాధించి మంచి ఊపుమీద ఉంది. వంద సీట్లకు చేరువలో సీట్లు సాధించి సత్తా చాటింది.
పెరిగిన సీట్లు
99 సీట్లు
కాంగ్రెస్ పార్టీ ఈ సారి సింగిల్‌గా 99 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది. 2014లో 44 సీట్లు మాత్రమే గెలిచింది. 2009 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్షానికి పరిమితమైంది. డబుల్ డిజిట్ సీట్లను మాత్రమే గెలుచి ఢీలా పడిపోయింది. 2019లో కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఆ సమయంలో రాయ్ బరేలి నుంచి సోనియా గాంధీ విజయం సాధించారు. అమేథి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ మాత్రం ఓడిపోయారు. కాంగ్రెస్ కంచుకోటలో స్మృతి ఇరానీ పాగా వేశారు. ఈ సారి మాత్రం కేఎల్ శర్మ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్‌ను రాహుల్ మట్టి కరిపించారు. వాయనాడుతో పాటు రాయ్ బరేలి నుంచి గెలుపొందారు.
234 సీట్లతో సరి
ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శించారు. రాహుల్, ఇతర ముఖ్య నేతలు ప్రధాని మోదీ, హొం మంత్రి అమిత్ షా లక్ష్యంగా విమర్శులు గుప్పించారు. ప్రజలకు మేలు చేయని విధానాలను ఎండగట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. 2019 ఎన్నికల కన్నా 47 సీట్లు ఎక్కువ గెలుచుకుంది. ఇండియా కూటమి అధికారం చేపడుతుందని ఓ దశలో విశ్లేషకులు అంచనా వేశారు. కానీ 234 సీట్ల వద్ద కూటమి ఆగిపోయింది. బీజేపీ కూటమికి మెజార్టీ మార్క్ వచ్చింది. సింగిల్‌గా బీజేపీ 240 సీట్ల వద్ద ఆగింది. ఇందుకు పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందు 400 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. ఈ సారి ప్రజలు మాత్రం బ్రహ్మారథం పట్టలేదు.
Updated Date - Jun 05 , 2024 | 02:36 PM