CWC: మన్మోహన్ సింగ్.. దేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పి
ABN , Publish Date - Dec 27 , 2024 | 08:11 PM
Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సంతాప తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో మన్మోహన్ సింగ్ తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో ఏ విధంగా పరుగు పెట్టిందో ప్రశంసలు కురిపించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భారతదేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. దూరదృష్టితో ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు..దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి రక్షించడమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు తలుపులు తెరిచాయని తెలిపింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం సంతాప తీర్మానం చేసింది.
నియంత్రణల సడలింపు, ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర విధానాల ద్వారా భారతదేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మన్మోహన్ సింగ్ పునాది వేశారని పేర్కొంది. భారతదేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దిన నిజమైన రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ అని తెలిపింది. భారత దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో ఆయన మహోన్నత వ్యక్తి అని చెప్పింది. మన్మోహన్ సింగ్ చేసిన కృషితో దేశ.. దశ, దిశను మార్చిందని వివరించింది. మన్మోహన్ ఆర్ధిక సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందాయని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గుర్తు చేసింది.
మన్మోహన్ సింగ్ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ అవతరించిందని వివరించింది. ఇది ఆయన ప్రతిభకు, దార్శనికతకు నిదర్శనమని పేర్కొంది. భారత 13వ ప్రధానిగా మన్మోహన్ సింగ్ సంకల్పంతోపాటు అసాధారణ ప్రతిభతో దేశాన్ని నడిపించారని సీడబ్ల్యూసీ ఈ సందర్భంగా ప్రశంసించింది. ప్రధానిగా మన్మోహన్ పదవీకాలంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రపంచ గుర్తింపు, సామాజిక పురోగతి లభించాయని తెలిపింది.
Also Read : వైఎస్ జగన్‌కు ఊహించని షాక్
2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక చర్యలతో దేశాన్ని ఆయన ముందుకు నడిపించిన తీరును వివరించింది. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు, అమెరికాతో పౌర అణు ఒప్పందం, జాతీయ ఆహార భద్రత చట్టం, భూసేకరణ చట్టం, వ్యవసాయ రుణ మాఫీ, రుణ మాఫీ, ఆర్టికల్ 15(5) ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలకు సామాజిక న్యాయం చేకూర్చే 93వ రాజ్యాంగ సవరణ, పారదర్శకతను పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), గిరిజన వర్గాల సాధికారత కోసం అటవీ హక్కుల చట్టం తీసుకు వచ్చారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
Also Read : కాలవలో పడిన బస్సు.. 8 మంది మృతి
మన్మోహన్ సింగ్ పదవీకాలంలో అత్యధిక జీడీపీ వృద్ధి రేటును సాధించిందంది. సమ్మిళిత వృద్ధి, అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక ఆధునీకరణ కోసం మన్మోహన్ సింగ్ అంకితభావంతో పని చేశారని.. ఇది ప్రపంచంలోనే భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసిందని వివరించింది. సామాన్య ప్రజల సంక్షేమంపై దృష్టి సారించి, స్థిరత్వం, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని చెప్పింది. సంస్కరణ వాద నేతగా మన్మోహన్ సింగ్ వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేసింది.
Also Read: బియ్యం మాయం కేసులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
ఆర్థికవేత్తగా భారతదేశ విధానాలు, దశ, దిశను రూపొందించారంటూ మన్మోహన్ సేవలను ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ప్రశంసించింది. ఆర్థికవేత్తగా ఆయన చేసిన కృషి, ఐక్యరాజ్యసమితి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల్లో ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమంది. మన్మోహన్ సింగ్ కు అర్థశాస్త్రంపై లోతైన అవగాహన, విద్య పట్ల ఆయనకున్న అంకితభావం రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చాయంది.
Also Read: కేంద్ర మంత్రి సన్నిహితుడిపై ఈడీ ఫోకస్
మన్మోహన్ మార్గదర్శకత్వం దేశ భవిష్యత్తు ఆర్థికవేత్తలపై శాశ్వత ప్రభావాన్ని చూపిందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. మన్మోహన్ సింగ్ అసాధారణమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని చెప్పింది. మన్మోహన్ వినయం, హుందాతనం ఆయన్ను అరుదైన వ్యక్తిగా నిలబెట్టాయంది. దేశంలో అత్యున్నత పదవులు నిర్వహించినప్పటికీ, ప్రతి ఒక్కరినీ గౌరవించే వారని పేర్కొంది. నిజమైన రాజనీతిజ్ఞుడి అత్యుత్తమ లక్షణాలైన కరుణ, నిజాయితీ, ప్రజాసేవ పట్ల లోతైన నిబద్ధత.. మన్మోహన్ సింగ్ చూపించారని సోదాహరణగా సీడబ్ల్యూసీ వివరించింది.
Also Read: జాక్ పాట్ కొట్టిన ట్రాఫిక్ పోలీసులు
Also Read: మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది
ఆర్థిక సంస్కరణలు, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధిపై మన్మోహన్ దార్శనికత అందరికీ స్ఫూర్తినిస్తూ, మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందంది. ఒక నాయకుడిగా, ఆర్థికవేత్తగా, వినయ పూర్వక మానవుడిగా మన్మోహన్ సింగ్ వారసత్వం సజీవంగా నిలిచి ఉంటుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తన సంతాప తీర్మానంలో స్పష్టం చేసింది.
For National News And Telugu News