Delhi : ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు?
ABN, Publish Date - Jul 29 , 2024 | 02:55 AM
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుకున్న విధంగా ఫలితాలను సాధించపోవడానికి కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్‌లో ఓటమి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది.
కారణాలు ఏమిటో సమీక్షించాలి.. పునరావృతం కాకుండా కార్యాచరణ
బీజేపీ సీఎంల సమావేశంలో నిర్ణయం
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
కొత్తవి ప్రారంభించి పర్యవేక్షించాలి
సీఎంలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢిల్లీ, జులై 28 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుకున్న విధంగా ఫలితాలను సాధించపోవడానికి కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్‌లో ఓటమి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. శనివారం నీతీఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్‌కు హాజరైన బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ సమావేశం తర్వాత.. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు.
ఆదివారం జరిగిన రెండోరోజు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర పథకాలను కిందిస్థాయి వరకు అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రులను కోరారు. నీతీఆయోగ్ సమావేశంలో నిర్ణయించిన విధంగా 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా ప్రభుత్వ పథకాలను వేగంగా అమలు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై), హర్ ఘర్ జల్ వంటి పథకాల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త పథకాలను ప్రారంభించాలని, వాటి అమలును నిరంతరం పర్యవేక్షించాలని, సుపరిపాలన విభాగాలను ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు ఆయా రాష్ట్రాల్లో తాము అమలుచేస్తున్న పథకాల గురించి వివరించినట్లు తెలిసింది.
రెండ్రోజుల సీఎంల సమావేశంలో సంస్థాగత వ్యవహారాలను, రాజకీయాలను పెద్దగా చర్చించలేదని.. పథకాల అమలుపైనే దృష్టి కేంద్రీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండేలా చూడాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా కేంద్ర పథకాలను రాష్ట్రాల్లో మార్చవద్దని సూచించినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్న లాడ్లీ బీమా యోజన, మహారాష్ట్రలో ప్రారంభించిన లడ్కీ బీమా యోజన పథకాలను, యూపీలో గ్రామ సచివాలయాల డిజిటలీకరణ వంటి కార్యక్రమాలను ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కాగా, సమావేశం తర్వాత.. ‘‘సుపరిపాలనతో ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు బీజేపీ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సుపరిపాలనకు ఉదాహరణలు’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
Updated Date - Jul 29 , 2024 | 02:55 AM