ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : వణుకుతున్న ఉత్తరాది

ABN, Publish Date - Aug 04 , 2024 | 02:32 AM

ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌ అతలాకుతలం

కోల్‌కతా ఎయిర్‌పోర్టులోకి వరద ఝార్ఖండ్‌లో పలు ప్రాంతాలు జలమయం

న్యూఢిల్లీ, బెంగళూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.

చాలా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అయితే కుండపోత వర్షాలకు పరిస్థితి భయానకంగా తయారైంది. నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో 190కి పైగా రోడ్లపై రాకపోకలను నిషేధించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం 82 బస్సు సర్వీసులను రద్దు చేసింది. విద్యుత్‌, తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జూన్‌ 27వ తేదీ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో 77 మంది మరణించగా, దాదాపు 655 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు ఎడతెరిపిలేని వర్షాలకు వణికిపోతున్నాయి. శనివారం కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది.

రన్‌వే, ట్యాక్సీవేలపై వరద నీరు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ విమానాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. విమానాలు పార్క్‌ చేసిన ప్రాంతంలో వర్షపు నీరు చేరిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పార్కింగ్‌ స్టాండ్లలోకి వరద చేరడంతో అదనపు మోటార్‌ పంపులతో నీటిని బయటకు పంపుతున్నారు.

కోల్‌కతా నగరంలో చాలా ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. అల్పపీడనం ప్రభావంతో పశ్చిమబెంగాల్‌లోని దక్షిణాది జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

పశ్చిమ వర్ధమాన్‌ జిల్లాలో నీట మునిగిన వంతెనను దాటుతుండగా కారు కొట్టుకుపోవడంతో ఓ వ్యక్తి మరణించారు. ఇక ఝార్ఖండ్‌లో భారీ వర్షాలకు చాలా రోడ్లు కొట్టుకుపోయాయి. ప లు ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా, ఇళ్లు దెబ్బతిన్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రాంచీలో ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను మోహరించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


మంగళూరు-హాసన్‌ మధ్య కుంగిన భూమి

కర్ణాటక రాష్ట్రం మంగళూరు-హాసన్‌ మార్గంలోని ఎడకుమరి, కడగరవళ్లి మధ్య భూమి కుంచించుకుపోవడంతో రాబోయే రెండు మూడు రోజులకు సంబంఽధించి ఆ మార్గంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు రైల్వేశాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా, దక్షిణకన్నడ జిల్లా బెళ్లిప్పాడిలో కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డంతో ఆరు పశువులు మృతి చెందాయి. మూడబిదరె వద్ద కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

హాసన్‌ జిల్లా సకలేశపుర ప్రాంతంలో జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు వంద ఇళ్లు నిర్మించి ఇస్తామని కేరళ సీఎం పినరయి విజయన్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య భరోసా ఇచ్చారు.

వయనాడ్‌లో ప్రకృతి విపత్తుల వల్ల ఇబ్బంది పడుతున్న బాధితులను ఆదుకోవడం మనందరి సమష్టి బాధ్యత అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అందుకోసం శనివారం ఆయన హైదరాబాద్‌లో విరాళాల సేకరణ చేపట్టారు.


ఊరంతా కొట్టుకుపోయింది

హిమాచల్‌ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో సిమ్లా జిల్లాలో సామెజ్‌ అనే గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఊరిలో ఓ ఇల్లు మాత్రమే మిగిలింది. మరో వృద్ధుడు పొరుగూరులో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. సామెజ్‌ గ్రామానికి చెందిన అనితాదేవి ఆ హృదయ విదారక దృశ్యాలను పంచుకున్నారు.

‘బుధవారం రాత్రి మేమంతా నిద్రలో ఉండగా పెద్ద శబ్దం వచ్చింది. బయటకొచ్చి చూస్తే ఊరు మొత్తం కొట్టుకుపోయింది. భయంతో మేం భగవతి కాళిమాత ఆలయానికి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాం. ఆ విధ్వంసంలో మా ఇల్లు మాత్రమే మిగిలింది.

నా కళ్ల ముందే అంతా కొట్టుకుపోయింది’ అని అనితాదేవి అన్నారు. అదే గ్రామానికి చెందిన బక్షీరామ్‌ అనే వృద్ధుడు.. ‘వరదలు వచ్చినపుడు నేను రాంపూర్‌లో ఉండటంతో బతికి బయటపడ్డా. అర్ధరాత్రి 2 గంటలకు వరదలు వచ్చినట్టు తెలిసింది.

4 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి చూడగా ఊరంతా ధ్వంసమైంది. నా కుటుంబ సభ్యులు 14-15 మంది వరదలో కొట్టుకుపోయారు’ అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆ గ్రామంలో మొత్తం 53 మంది గల్లంతు కాగా, 6 మృతదేహాలు లభ్యమయ్యాయి.

Updated Date - Aug 04 , 2024 | 05:13 AM

Advertising
Advertising
<