Gadchiroli Encounter: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి
ABN, Publish Date - Jul 18 , 2024 | 04:32 AM
దండకారణ్యంలో మరోసారి నెత్తురోడింది. మహారాష్ట్ర-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దులోని గడ్చిరోలి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
మృతుల్లో తిప్పగడ్డ దళం ఇన్‌చార్జి ఆత్రం లక్ష్మణ్
ఏకే-47, ఎల్‌ఎంజీ తుపాకుల సీజ్
ఒక ఎస్సై, మరో జవానుకు తూటా గాయాలు
వారోత్సవాల ముందు నక్సల్స్‌కు భారీ ఎదురుదెబ్బ
ఈ ఏడాది ఇది పదో ఎన్‌కౌంటర్
ఏడు నెలల్లో 148 మంది నక్సల్స్ మృతి
గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. మృతుల్లో తిప్పగడ్డ దళం ఇన్‌చార్జి ఆత్రం లక్ష్మణ్
చర్ల/వహదేవపూర్, జులై 17: దండకారణ్యంలో మరోసారి నెత్తురోడింది. మహారాష్ట్ర-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దులోని గడ్చిరోలి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో సీ-60 బలగాలకు చెందిన ఒక ఎస్సై, మరో జవాన్ గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి అత్యంత అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ కథనం ప్రకారం.. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ సరిహద్దులోని గడ్చిరోలి, కాంకేర్ జిల్లాల అడవుల్లో 12 నుంచి 15మంది మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు.
దీంతో సీ-60 బలగాలు ఉదయం 7 గంటల సమయంలో కూంబింగ్ ప్రారంభించారు. 10 గంటల సమయంలో వారికి నక్సలైట్లు తారసపడ్డారు. ఆరు గంటల పాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. సాయంత్రం 4 గంటల సమయంలో నక్సల్స్ వైపు నుంచి కాల్పులు నిలిచిపోవడంతో.. బలగాలు ముందుకు దూసుకెళ్లాయి. అక్కడ 12 మంది మావోయిస్టుల మృతదేహాలను, మూడు ఏకే-47 తుపాకులు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడు, తిప్పగడ్డ దళ ఇన్‌చార్జి ఆత్రం లక్ష్మణ్ అలియాస్ ఆత్రం విశాల్ మృతిచెందినట్లు ఎస్పీ వివరించారు.
అతను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడని అనుమానిస్తున్నారు. మిగతా 11 మంది నక్సల్స్‌ను గుర్తించాల్సి ఉందని తెలిపారు. కాగా.. గడిచిన ఏడు నెలల్లో దండకారణ్యంలో 10 భారీ ఎన్‌కౌంటర్లు జరగ్గా.. 148 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు పార్టీ ప్రతీ సంవత్సరం జూలై 28 నుంచి వారంరోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ ఏడాది వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో 20 రోజుల ముందుగానే వారోత్సవాలు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే భారీ ఎన్‌కౌంటర్ జరగడంతో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
Updated Date - Jul 18 , 2024 | 04:32 AM