Bengaluru: పంచెకట్టుతో వచ్చాడని రైతుకు నో ఎంట్రీ..!
ABN, Publish Date - Jul 18 , 2024 | 05:04 AM
బెంగళూరు నగరంలోని జీటీ వరల్డ్ మాల్‌లో సినిమా చూసేందుకు వచ్చిన రైతుకు అవమానం జరిగింది. పంచె కట్టుతో వచ్చాడని ఆ రైతుని సిబ్బంది లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.
బెంగళూరులో అన్నదాతకు అవమానం
బెంగళూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలోని జీటీ వరల్డ్ మాల్‌లో సినిమా చూసేందుకు వచ్చిన రైతుకు అవమానం జరిగింది. పంచె కట్టుతో వచ్చాడని ఆ రైతుని సిబ్బంది లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని హావేరి జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి మంగళవారం మాగడి రోడ్డులోని జీటీ మాల్‌కు సినిమాకు వెళ్లారు. పంచెకట్టుతో ఉన్న నాగరాజు తండ్రిని చూసి ప్రవేశ ద్వారం వద్ద సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
నాగరాజు జీటీ మాల్ సిబ్బందితో అరగంటకుపైగా వాదించినా వారు అంగీకరించ లేదు. వాగ్వాదం జరుగుతున్న సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. జీటీ మాల్ సిబ్బంది తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. రైతు సంఘాలు, కన్నడ సంఘాల సభ్యులు బుధవారం పంచెకట్టుతో వెళ్లి జీటీ మాల్ ముందు నిరసన తెలిపారు.
Updated Date - Jul 18 , 2024 | 05:04 AM