Share News

ఎంపాక్స్‌ చికిత్సకు మార్గదర్శకాలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:29 AM

ఎంపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించడానికి ఢిల్లీ ఎయిమ్స్‌ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఐసొలేషన్‌ వార్డులో చికిత్స కోసం ఐదు పడకలను కేటాయించింది. ఇతర రోగులు, సిబ్బందితో కాంటాక్ట్‌ను తగ్గించడానికి అనుమానిత

ఎంపాక్స్‌ చికిత్సకు మార్గదర్శకాలు

రోగుల ఐసొలేషన్‌కు 5 పడకలు కేటాయింపు

వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం: సీరం

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఎంపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించడానికి ఢిల్లీ ఎయిమ్స్‌ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఐసొలేషన్‌ వార్డులో చికిత్స కోసం ఐదు పడకలను కేటాయించింది. ఇతర రోగులు, సిబ్బందితో కాంటాక్ట్‌ను తగ్గించడానికి అనుమానిత రోగులను వెంటనే నిర్దేశిత ఐసొలేషన్‌ వార్డులో ఉంచాలని పేర్కొంది. ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, వేగంగా గుర్తించడం, వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కఠినమైన నియంత్రణ చర్యలు అవసరమని తెలిపింది. ఎయిమ్స్‌ జారీ చేసిన ఎస్‌వోపీ ప్రకారం.... మంకీపాక్స్‌ అనేది వైరల్‌ జునోసిస్‌ వ్యాధి. ఇది మశూచి రోగుల్లో కనిపించిన లక్షణాలను పోలి ఉంటుంది. అయితే దీని తీవ్రత తక్కువ. జ్వరం, దద్దుర్లు లేదా మంకీపాక్స్‌ నిర్ధారణ అయిన రోగులను కలిసిన చరిత్ర ఉన్నవారిని తక్షణం గుర్తించాలి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, చర్మంపై పొక్కులు, దద్దుర్లు తదితర లక్షణాలతో వచ్చేవారిని ఐసొలేట్‌ చేయడానికి ఏబీ-7 వార్డులో ఐదు పడకలు కేటాయించినట్లు తెలిపింది. అత్యవసర విభాగం చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సిఫారసు మేరకు ఈ పడకలను రోగులకు కేటాయిస్తారు. రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్య సిబ్బంది తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) ఉపయోగించాలని ఎయిమ్స్‌ స్పష్టం చేసింది. రోగులను సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించడానికి ప్రత్యేక అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. కాగా, మంకీపాక్స్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని, ఏడాదిలో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అధర్‌ పూనావాలా మంగళవారం ప్రకటించారు.


మరో కొవిడ్‌ కాదు

ఎంపాక్స్‌ను కొవిడ్‌-19తో పోల్చలేమని, దాని వ్యాప్తిని నియంత్రించడం సాధ్యమేనని డబ్ల్యూహెచ్‌వో అధికారి ఒకరు తెలిపారు. దీని వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన చర్యలు అధికారులకు తెలుసని అన్నారు. మనందరం కలసి ఎంపాక్స్‌ను ఎదుర్కోవాలని డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ రీజినల్‌ డైరెక్టర్‌ హాన్స్‌ క్లూజ్‌ పేర్కొన్నారు. ‘ఎంపాక్స్‌ కట్టడికి వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటామా? లేకపోతే మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా? అనేది ఇప్పుడు మనం ఎలా స్పందిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది’’ అని క్లూజ్‌ అన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 05:29 AM