Share News

Sanjay Roy: ఈ నీచుడు మామూలోడు కాదు.. అధికారులకే ముప్పు తిప్పలు పెడుతున్న సంజయ్ రాయ్

ABN , Publish Date - Aug 26 , 2024 | 01:04 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి సోమవారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు అధికారులు బయటకి వెల్లడించలేదు.

Sanjay Roy: ఈ నీచుడు మామూలోడు కాదు.. అధికారులకే ముప్పు తిప్పలు పెడుతున్న సంజయ్ రాయ్

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి సోమవారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు అధికారులు బయటకి వెల్లడించలేదు. అయితే అధికారుల దగ్గర సంజయ్ అన్ని అబద్ధాలే చెప్పినట్లు, ఒకదానికొకటి పొంతన లేని సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది.

ఆర్జీ కర్ ఆసుపత్రి సెమినార్ హాల్‌లోకి వెళ్లేసరికే డాక్టర్ చనిపోయి కనిపించిందని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం. ఇక ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో నిందితుడు అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు అన్నీ అబద్ధాలు, నమ్మశక్యం కాని సమాధానాలను చెప్పినట్లు తెలుస్తోంది.


పాలిగ్రాఫ్ పరీక్ష సందర్భంగా సీబీఐ అధికారులు నిందితుడికి ఆధారాలు చూపించినప్పుడు.. ఆ సమయంలో తాను అక్కడ లేనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తాను వెళ్లేసరికి డాక్టర్ చనిపోయి ఉందని, దాంతో తనకు భయమేసి అక్కడి నుంచి పారిపోయాయని అన్నాడట.

సంజయ్ న్యాయవాది ఆరోపణలు..

నిందితుడు సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్‌ టెస్ట్ నిర్వహించే సమయంలో అతడి తరఫు డిఫెన్స్‌ న్యాయవాది లేకపోవడం చర్చకు దారి తీసింది. దీనిపై నిందితుడి లాయర్ స్పందించారు. పాలిగ్రాఫ్ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన ఆరోపించారు.


పూటకో మాట.. అధికారులకు తిప్పలు...

సంజయ్ రాయ్ మానసిక పరిస్థితిపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే అతను అబద్ధాలు చెబుతున్నాడా..? లేదంటే మానసిక పరిస్థితి సరిగ్గాలేదా..? అనేది అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. కేసు నమోదయ్యాక సంజయ్‌ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. డాక్టర్‌‌ను తాను అత్యాచారం చేసినట్లు కోల్‌కతా పోలీసుల ముందు చెప్పాడు.

ఆ తరువాత సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం కూడా నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఇందులో అతను ఆ ఘటనను పైసగుచ్చినట్లు గుక్కతిప్పకుండా చెప్పాడని, అప్పుడు అతడిలో పశ్చాత్తాపమే కనిపించలేదని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సీబీఐ అధికారి తెలిపారు. అయితే అతడ్ని కోర్టులో హాజరుపరిచినపుడు, తాను ఏ తప్పూ చేయలేదని.. కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని ఏడవడం చర్చనీయాంశం అయింది. ఇలా పూటకో మాట చెబుతూ అధికారులకే పరీక్ష పెడుతున్నాడు. దీంతో విచారణ చేసే అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.


For Latest News click here

Updated Date - Aug 26 , 2024 | 01:22 PM