Delhi: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర పంచాయితీ.. క్యాబినెట్ విస్తరణపై కీలక చర్చలు..
ABN, Publish Date - Dec 12 , 2024 | 05:21 PM
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ హాజరయ్యారు.
ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ కేటాయింపు అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి పదవి ఆశించి ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ(గురువారం) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీయే పెద్దలతో జరిగిన కీలక సమావేశంలో ఏక్‌నాథ్ షిండే పాల్గొనలేదనే ప్రచారం జోరందుకుంది. కాగా, ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే కొన్ని కీలక మంత్రిత్వ శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు బీజేపీ విముఖత చూపడంతోనే ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అయితే మహాయుతిలో క్యాబినెట్ విస్తరణపై వివాదం నడుస్తోందన్న ప్రచారాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కొట్టిపారేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ హాజరయ్యారు. అయితే క్యాబినెట్ విస్తరణ కోసమే అజిత్ పవార్ ఢిల్లీకి వచ్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం ఫడ్నవీస్ ఖండించారు. ఆయన కొన్ని పనుల కారణంగా ఢిల్లీకి వచ్చారని, ఈ మేరకు సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. ప్రచారం జరుగుతున్నట్లుగా మహాయుతిలో ఎలాంటి వివాదాలు లేవంటూ ఆయన చెప్పుకొచ్చారు. షిండే సమావేశానికి హాజరుకాకపోవడానికి క్యాబినెట్ కేటాయింపు ఏమాత్రం కారణం కాదని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. అలా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. అలాగే ఈ సమావేశంలో క్యాబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చలూ జరగలేదని ఫడ్నవీస్ చెప్పారు.
క్యాబినెట్ విస్తరణపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ కోటా నుంచి మహారాష్ట్ర మంత్రులను ఎంపిక చేసే విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. అదే విధంగా ఎన్సీపీ, శివసేన తమతమ అభ్యర్థుల పేర్లను నిర్ణయిస్తాయని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఫార్ములాపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన సమావేశానికి ఏక్‌నాథ్ షిండే హాజరుకాకపోవడం, సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెంట ఆయన దేశ రాజధానికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మహాయుతి మిత్రపక్షాలతో మహారాష్ట్ర మంత్రిత్వ శాఖల పంపిణీకి సంబంధించి బీజేపీ అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకే ఫడ్నవీస్ డిసెంబర్ 11న ఢిల్లీ చేరుకున్నారని ప్రచారం జరిగింది. అయితే శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. షిండే కీలక మంత్రి పదవులు ఆశిస్తున్నారని, అందుకు బీజేపీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివసేనకు పట్టణాభివృద్ధి వంటి ఒక్క ప్రధాన మంత్రిత్వ శాఖనే కేటాయించడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు షిండే సన్నిహితులు చెబుతున్నారు. షిండే హోంశాఖ కావాలని పట్టుపడుతున్నారు. కానీ అది ఇచ్చేందుకు సిద్ధంగా లేమని బీజేపీ బహిరంగంగానే చెప్పేసింది. అలాగే రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్, హౌసింగ్, పరిశ్రమ వంటి పెద్దపెద్ద మంత్రిత్వ శాఖలను షిండే ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
One Nation One Election Bill: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్ విషయంలో కీలక నిర్ణయం
Gurugram Blast: గురుగ్రామ్‌లో బాంబు పేలుడు.. సంచలన ప్రకటన చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..
Updated Date - Dec 12 , 2024 | 05:25 PM