Maharashtra Elections: మహారాష్ట్ర ఫలితాలను శాసించిన సూపర్ పవర్.. ఒక్క నెలలో అంతా తారుమారు
ABN, Publish Date - Nov 23 , 2024 | 07:32 PM
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఊహించని దాని కంటే భారీ విజయం సాధించిన ఎన్డీయే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పనుల్లో బిజీ అయిపోయింది.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వడంలో విఫలమైంది. సర్కారు ఏర్పాటుకు కావాల్సిన సీట్లను దక్కించుకున్న ఎన్డీయే.. భారీ మెజారిటీ దిశగా సాగుతోంది. ఇప్పటికే 153 స్థానాల్లో గెలిచిన మహాయుతి.. మరో 75 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 145 ఎమ్మెల్యేల అవసరం ఉంది. మహాయుతి ఇప్పటికే ఆ మార్క్‌ను దాటేసింది. ఊహించిన దాని కంటే ఘనవిజయం సాధించడంతో కూటమి సంతోషంగా ఉంది. అయితే ఈ విక్టరీకి కూటమిలోని పార్టీలు, ప్రధాన నేతలే కారణమని అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఎన్డీయే సంచలన విజయం వెనుక ఓ సూపర్ పవర్ ఉందని చాలా మందికి తెలియదు. ఏమిటా అదృశ్య శక్తి? అది చేసిన మ్యాజిక్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
ఒక్క నెలలోనే..
దేశంలోనే మూడో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఆర్థిక రాజధాని ముంబై కూడా ఆ స్టేట్‌లోనే ఉండటంతో అందరి చూపు అటు వైపే ఉండేది. దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ ఎక్కువైంది. కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు మహా ఎలక్షన్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇతర పార్టీలతో జతకట్టి కూటములను ఏర్పాటు చేశాయి. ఢీ అంటే ఢీ అంటూ ప్రజాక్షేత్రంలో తలపడ్డాయి. అయితే ఎట్టకేలకు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమినే విజయం వరించింది. దీంతో అంతా కమలం పార్టీ నేతలతో పాటు కూటమిలోని ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కానీ కూటమి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురించి మాత్రం పెద్దగా చర్చలు జరగడం లేదు. ఈ ఎన్నికలను సంఘ్ శాసించిందనే చెప్పాలి. ఒక్క నెలలోనే ఆర్ఎస్ఎస్ అంతా మార్చేసింది.
పక్కా ప్లానింగ్
మహారాష్ట్ర ఎన్నికల సమరంలో ఒక సమయంలో ఎన్డీయే బాగా వెనుకబడింది. కూటమికి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే గ్రౌండ్ లెవల్ రియాలిటీని అర్థం చేసుకున్న ఆర్‌ఎస్ఎస్.. సరైన వ్యూహాలతో కదనరంగంలోకి దూకి జోరు పెంచింది. పక్కా ప్లానింగ్‌తో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి సక్సెస్ అయింది. తమకు పట్టు ఉన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జోరుగా ప్రచారం చేసింది. దీంతో నెల రోజుల కింద వరకు వెనుకబడిన ఎన్డీయే ఒక్కసారిగా పుంజుకుంది. సాధారణంగా మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఉదాసీనతతో ఉంటారు. ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపించరు. పట్టణ ప్రాంతాల్లో నమోదయ్యే ఓటు శాతమే దీనికి పెద్ద ఉదాహరణ. కానీ దీన్నే క్యాష్ చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించుకుంది.
ఆ ఓటర్లే టార్గెట్
ముంబై, పూణె, నాగ్‌పూర్‌తో పాటు ఇతర పట్టణాలను టార్గెట్ చేసుకొని సంఘ్ కార్యకర్తలు గత నెల రోజులు జోరుగా ప్రచారం చేశారు. సుస్థిర ప్రభుత్వాలతో వేగంగా అభివృద్ధి జరుగుతుందని, ఎన్డీయే కూటమితోనే అది సాధ్యమని చెబుతూ పట్టణ ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు ప్రయత్నించారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ కమ్యూనిటీ మీటింగ్స్ కూడా నిర్వహించారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇల్లు దాటి పోలింగ్ కేంద్రాలకు తరలేలా చేయగలిగారు. గ్రామాల్లోనూ బీజేపీకి బలమైన క్యాడర్ ఉండటంతో వాళ్ల సాయంతో ప్రచారం హోరెత్తించింది ఆర్ఎస్ఎస్.
క్రెడిట్ ఇవ్వాల్సిందే..
ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాలు బాగా సక్సెస్ అయ్యాయి. పట్టణ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడమే దీనికి బిగ్ ఎగ్జాంపుల్. గ్రామాలతో పాటు పట్టణ, మధ్యతరగతి ఓటర్లను మహాయుతి కూటమి వైపు మొగ్గేలా చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. అందుకే ఇంత భారీ విజయాన్ని సాధించింది ఎన్డీయే. కొన్ని వారాల కింద సంఘ్ గనుక అలర్ట్ కాకపోయి ఉంటే రిజల్ట్ ఇలా ఉండేది కాదని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఆర్ఎస్ఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ప్రచారం, అమలు చేసిన వ్యూహాలతో ఫలితాలు తారుమారు అయ్యాయని.. ఎన్డీయే సక్సెస్‌కు ఫుల్ క్రెడిట్ సంఘ్‌కు ఇవ్వాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:
‘మహా’ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. బీజేపీ కొత్త తిప్పలు
లక్షల మంది ఫాలవోర్లు.. ఎమ్‌ఎల్‌ఏగా పోటీ చేయగా.. తెలుగు సినిమా విలన్‌కు ఇలా జరిగిందేంటీ..
'మహా' విజయంపై మోదీ ఫస్ట్ రియాక్షన్
For More National And Telugu News
Updated Date - Nov 23 , 2024 | 07:47 PM