Meria Kumari : ప్రత్యేక హోదాపై బిహార్‌లో పోరు
ABN, Publish Date - Jul 13 , 2024 | 03:24 AM
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బిహార్లో అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
ఎన్డీయే, మహాకూటమి పరస్పర విమర్శలు
పట్నా, జూలై 12: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బిహార్లో అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. హోదా ఇవ్వాలంటూ ఇటీవల ఎన్డీయే భాగస్వామి జేడీయూ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించారని.. మిత్రపక్షం డిమాండ్‌ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆమోదించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ధ్వజమెత్తారు.
మోదీ ప్రభుత్వం జేడీయూపై ఆధారపడి ఉన్నా పట్టించుకోవడం లేదని శుక్రవారం అన్నారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే హోదా డిమాండ్‌ను అటకెక్కించిందని జేడీయూ నేత శ్రావణ్‌కుమార్ దుయ్యబట్టారు. ఎన్డీయే మరో భాగస్వామి ఎల్‌జేపీ(రాంవిలాస్) ఎంపీ అరుణ్ భారతి కూడా హోదా డిమాండ్‌ను సమర్థించారు. రాష్ట్రానికి హోదా గానీ, ప్రత్యేక ప్యాకేజీ గానీ ఇస్తారని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలో ఉందని..
హోదా ఇవ్వడానికి చర్యలు తీసుకోకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రతిపక్షంలోని ఆర్జేడీ ఆరోపించింది. రాష్ట్రాన్ని చీల్చి జార్ఖండ్‌ను ఏర్పాటుచేసిన తర్వాత ఖనిజ సంపదను బిహార్ కోల్పోయింది. దీనికి ప్రతిగా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ 2000 నుంచీ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చేసినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు. కానీ 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందంటూ మోదీ ప్రభుత్వం పక్కనపెట్టేసింది.
Updated Date - Jul 13 , 2024 | 03:24 AM